logo

చెత్త స్టేషన్‌!

కావలి రైల్వేస్టేషన్‌ సహా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్ధితులు అధ్వానంగా ఉన్నాయి. రైల్వే, పురపాలక అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో ఈ దుస్థితి.

Published : 26 May 2024 02:59 IST

రైల్వే అధికారుల అలసత్వం
పట్టించుకోని కావలి పురపాలకం

ఈ చిత్రంలో కనిపించేది కావలి రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాంల వద్ద పేరుకుపోతున్న చెత్తాచెదారాలు. రాత్రివేళల్లో స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు దోమలబెడదతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేస్టేషన్‌ పారిశుద్ధ్య విభాగం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది.

కావలి, న్యూస్‌టుడే: కావలి రైల్వేస్టేషన్‌ సహా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్ధితులు అధ్వానంగా ఉన్నాయి. రైల్వే, పురపాలక అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో ఈ దుస్థితి. ప్రధానంగా ఉత్తర, దక్షిణ జనతాపేటవాసులు ఈ రైల్వే పట్టాలకు ఆనుకొని ఉండేవారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ పరిధిలో రైల్వే పట్టాలకు ఆనుకుని నివసించే ఇతర ప్రాంతాల ప్రజానీకం సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ప్రయాణికుల వినియోగించిన వస్తువుల వ్యర్థాలు వేసేందుకు అవుట్‌లెట్‌ లేదు. స్టేషన్‌కు సమీపంలో ఉన్న పరిసరాల్లోనే అంతా కుప్పగా పారబోస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్‌కు వచ్చేవారికి సమస్యలు ఎదురవుతున్నాయి. రాత్రివేళల్లో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. జనతాపేట నుంచి పట్టాలు దాటుకొని వచ్చే వారు సమస్య ఎదుర్కొంటున్నారు. స్టేషన్‌ తూర్పు వైపు ముఖద్వారం వద్ద అధ్వానంగా ఉంది.

పట్టాలకు ఇరువైపులా..

జనతాపేట ప్రాంతం వద్ద రైల్వేశాఖ నిర్లక్ష్యంతో పట్టాలకు ఇరువైపులా చెత్త వేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్న చెత్తాచెదారాలను ఇక్కడ గుట్టగుట్టలుగా పోస్తున్నారు. దీంతో సంకలవారితోట, కళుగోళమ్మపేట, పూలబజార్, వడ్డిపాళెం, క్రిస్టియన్‌పేట, కోఆపరేటివ్‌కాలనీ, శాంతినగర్‌ ప్రాంతాల ప్రజలు దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు.

ఎవరూ పట్టించుకోవడం లేదు

కావలి జనతాపేట దక్షిణ ప్రాంతంలో పాత నవాబు భవన సముదాయం వెనుక నుంచి పురపాలక డ్రైన్‌ రైల్వేగోడకు ఆనుకుని వెళ్తోంది. రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాలువ బాగోగులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రైల్వే క్వార్టర్స్‌లో ఉండే ఉద్యోగుల కుటుంబాలకు సైతం చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాత భవనాలు అలాగే ఉంచడటంతో సమస్యలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వడ్డిపాళెం వద్ద పాతభవనాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.

చిత్రంలో కనిపించేది కావలి పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు ఆనుకొని వెళ్లే మురుగుకాలువ. ఈ కాలువలో చెత్తాచెదారమంతా అడ్డగోలుగా పేరుకుపోతున్నాయి. దీంతో మురుగు ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక వర్షాలొచ్చినప్పుడైతే అదనపు వరద జలాలు ముందుకెళ్లేందుకు వీల్లేక పొంగిపొర్లుతోంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

మా స్టేషన్‌ నుంచి చెత్తాచెదారాలు స్థానికంగా వేయడం లేదు. రైల్వేట్రాక్‌ వెంబడి వేస్తున్న చెత్తచెదారాలపై పరిశీలిస్తాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

అశోక్, సూపరింటెండెంట్, కావలి రైల్వేస్టేషన్‌

బాగు చేయిస్తాం

పురపాలక పరిధిలో ఉండే చెత్తాచెదారాలకు బాధ్యత వహిస్తాం. మేజర్‌ డ్రైన్‌లో పూడిక తీయిస్తాం. రైల్వేస్టేషన్‌ పారిశుద్ధ్య విభాగం కూడా అవసరమైన కార్యాచరణ చేపట్టాలి. ప్రజలకు సమస్యల్లేకుండా చేస్తాం.

జి.శ్రావణ్‌కుమార్, కమిషనర్, కావలి పురపాలకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని