logo

అందరికీ అందేదెన్నడో!

పాఠశాలల పునఃప్రారంభం సమీపిస్తోంది. కానీ విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చేరలేదు.

Updated : 26 May 2024 04:58 IST

అరకొర పాఠ్యపుస్తకాలు..

జలదంకి విద్యావనరుల కేంద్రానికి చేరిన పాఠ్యపుస్తకాలు

దుత్తలూరు, న్యూస్‌టుడే: పాఠశాలల పునఃప్రారంభం సమీపిస్తోంది. కానీ విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చేరలేదు. ఏటా బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సమకూర్చుతామని అధికారులు చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పాఠశాలలు తెరిచిన రెండు నెలల వరకు పుస్తకాలు అందుబాటులోకి రావడం లేదు. ఈ ఏడాది అదే తీరు కనిపిస్తోంది.

ఏటా ఇదే పరిస్థితి..

ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 453 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటికి ఆయా తరగతులకు సంబంధించి మొత్తం 2,26,841 పుస్తకాలు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కేవలం 66,386 మాత్రమే వచ్చాయి. ఇంకా 1,60,455 పుస్తకాలు రావాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ శాఖ అధికారులు అందజేసిన ఇండెంట్ ప్రకారం పాఠ్యపుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు చేర్చాలి. కానీ ఏటా సక్రమంగా సకాలంలో అందటంలేదు. దీంతో పాఠశాలలు ప్రారంభమైన నెల వరకు విద్యార్థులను పుస్తకాల అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 8-10 తరగతుల విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే మండల కేంద్రాలకు చేరాయి. మిగిలిన ఒకటి నుంచి ఏడో తరగతి పాఠ్యపుస్తకాలు ఇప్పటివరకు రాలేదు. వరికుంటపాడు, కొండాపురం మండలాలకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క పుస్తకం కూడా రాకపోవడం గమనార్హం.

విద్యార్థుల్లో ఆందోళన

పాఠశాలలు ప్రారంభం నాటికి అన్నీ పుస్తకాలు వస్తాయనే నమ్మకం లేదు. ఇదిలా ఉండగా విద్యావనరుల కేంద్రాలకు వచ్చిన వాటిని బడులకు పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా పూర్తిస్థాయిలో వచ్చిన తరువాత పంపిణీ చేద్దామన్న ఆలోచనలో స్థానిక అధికారులు ఉన్నారు. దీంతో పూర్తిస్థాయిలో అందుతాయో లేదోనని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

సకాలంలో అందజేస్తాం

జిల్లాకు వచ్చిన పాఠ్య పుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు చేరవేస్తున్నాం. మొదటి విడతగా వచ్చిన పుస్తకాలను ఇప్పటికే విద్యా వనరుల కేంద్రాలకు పంపించాం. మిగిలిన వాటిని త్వరలోనే ఆయా మండలాలకు చేరవేస్తాం. పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుస్తకాలతోపాటు విద్యా కానుక కిట్లను కూడా అందజేస్తాం.

రఘురామయ్య, కావలి ఉప విద్యాశాఖాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని