logo

ముందుచూపు లేకుంటే.. ముంపే!

వర్షాకాలం వస్తోందంటే నగరవాసుల్లో ఆందోళన మొదలవుతోంది. నెల్లూరు నగరంతో పాటు లోతట్టు కాలనీ వాసుల్లో ముంపు భయం వెంటాడుతోంది.

Published : 26 May 2024 02:54 IST

కాలువల్లో పూడిక తీస్తేనే మేలు
 న్యూస్‌టుడే, నెల్లూరు (నగరపాలకసంస్థ)

నీట మునిగిన మాగుంట లేఅవుట్‌ (పాత చిత్రం)

వర్షాకాలం వస్తోందంటే నగరవాసుల్లో ఆందోళన మొదలవుతోంది. నెల్లూరు నగరంతో పాటు లోతట్టు కాలనీ వాసుల్లో ముంపు భయం వెంటాడుతోంది. ఏటా జలమయమవుతున్న ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఒక్కోసారి నాలుగైదు రోజుల పాటు కాలనీలు నీటిలోనే ఉంటున్నాయి. ఏటా సమస్య ఎదురవుతున్నా.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేవు. మురుగు కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేస్తే కొంత వరకు ముంపు ముప్పు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి.

వర్షం పడితే సమస్యే

నెల్లూరు నగరంలో వర్షం కురిస్తే కుంచించుకుపోయిన మురుగునీటి కాలువలు వర్షపునీటి ప్రవాహాన్ని అడ్డుకోనున్నాయి. 2015 నవంబరులో జిల్లా కేంద్రంలో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరింది. 2021, 2022, 2023లో కురిసిన వర్షాలకు నగరంలోని ప్రధాన ప్రాంతాలు నీట మునిగాయి. శివారు కాలనీల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. నగరంలో కురిసిన వర్షం మురుగునీటి కాలువల ద్వారా బయట ప్రాంతాలకు సులువుగా చేరుకోవాలంటే.. ముందస్తుగా ఆయా నాళాలను శుభ్రం చేయాలి. వర్షపునీరు రోడ్లపై పారకుండా నాళాల ద్వారా బయటకు వెళ్లేలా ఉండాలి. దీంతో ముప్పును ముందస్తుగా తప్పించేందుకు అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి కాలువల్లో పూడిక తీయించాల్సిన ఆవశ్యకత ఉంది.

మన్సూర్‌నగర్‌లో కాలువ దుస్థితి

పనులు చేపడతాం

సమస్యపై ఎస్‌ఈ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ వర్షపునీటి పారుదలకు ఆటంకం లేకుండా కాలువల్లో పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. అలాగే నగరవ్యాప్తంగా కాలువల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు.

ఈ కాలనీల్లోనే..

నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారితో పాటు వహాబ్‌పేట, లీలామహల్‌ రోడ్డు, భగత్‌సింగ్‌కాలనీ, జనార్దన్‌రెడ్డికాలనీ, వైఎస్సార్‌నగర్, పోలీసు కాలనీ, రెవెన్యూ కాలనీ, చంద్రబాబునగర్, పరమేశ్వరినగర్, డ్రైవర్స్‌కాలనీ, మన్సూర్‌నగర్, జయలలితనగర్, పొర్లుకట్ట తదితర ప్రాంతాలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. వీటితో పాటు నగరంలోని మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండు వంతెనల కింద భారీగా నీరు చేరి.. నగరంలోకి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు స్పందించి కాలువల్లో పూడిక తీయించి ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు