logo

అయిదేళ్లు.. ఏవీ అభివృద్ధి ఆనవాళ్లు?

నగరాలు, పట్టణాలలో తాగునీరు, భూగర్భ మురుగునీటి పారుదల వసతులు, పార్కుల అభివృద్ధి తదితర పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకాన్ని 2015లో ప్రారంభించింది.

Published : 26 May 2024 03:05 IST

కావలి ముసునూరులో వినియోగంలోకి రాని ఓవర్‌హెడ్‌ ట్యాంకు

  • కావలి పట్టణంలో మురుగునీటి శుద్ధికి రూ.29 కోట్లతో 17ఎంఎల్‌డీల సామర్థ్యమున్న ఎస్‌టీపీ పనులు చేపట్టినా.. నేటికీ పూర్తి కాలేదు. ఈ మొత్తంలో రూ.22 కోట్ల యూనిట్‌ విలువ కాగా.. మిగిలింది నిర్వహణకు కేటాయించారు. రెండేళ్ల క్రితమే 80 శాతం పనులు పూర్తికాగా.. మిగిలినవి నత్తలతో పోటీ పడుతున్నాయి. పట్టణంలోని విలీన గ్రామాలతో పాటు కావలి పట్టణం, వెంగళరావునగర్‌ తదితర ప్రాంతాలకు కొత్త పైపులైన్లు, సర్వీసు రిజర్వాయర్లను నిర్మించేందుకు రూ.59.3 కోట్లతో పనులు ప్రారంభించారు. వీటిలో 83 శాతమే పూర్తయ్యాయి.
  • నెల్లూరు నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు రూ.82 కోట్లతో స్ట్రామ్‌వాటర్‌ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. రూ.15 కోట్లు ఖర్చు చేసి.. కేవలం 20 శాతం పనులు పూర్తి చేశారు. వాటిని సక్రమంగా చేయకపోవడంతో మురుగునీటి కాలువలుగా మారాయి. ఫలితంగా చిన్నపాటి వర్షానికే నగరంలోని ప్రధాన ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.

ఈనాడు, నెల్లూరు

నగరాలు, పట్టణాలలో తాగునీరు, భూగర్భ మురుగునీటి పారుదల వసతులు, పార్కుల అభివృద్ధి తదితర పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకాన్ని 2015లో ప్రారంభించింది. పథకం కింద చేపట్టే పనులకు అవసరమైన నిధుల్లో కేంద్రం 50 శాతం, రాష్ట్రం 20 శాతం, ఆయా పురపాలక సంఘాలు 30 శాతం నిధులు సమకూర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీల వాటా 50 శాతం జమ చేస్తేనే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మొదటి విడతలో నెల్లూరు నగరంలో రూ.115 కోట్లతో పార్కులు, వరద పారుదల వ్యవస్థ పనులు చేపట్టగా.. కావలి పట్టణంలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టారు. ఎనిమిదేళ్లలో వీటిలో రెండు, మూడు పార్కులు మినహా మిగిలిన పనులు పూర్తి కాలేదు. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 80 శాతం పూర్తయిన పనులు.. అయిదేళ్లలో అయిదు శాతం కూడా జరగలేదు. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కారణంగా పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా అందకపోవడంతో స్థానిక సంస్థలే బ్యాంకు రుణాలు తీసుకొచ్చి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు కొంతమేర నగదు చెల్లించడంతో గుత్తేదారులు చేస్తున్న పనులతో ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి.

నెల్లూరు.. నిర్మాణ పనులు చేయక అధ్వానంగా కాలువ

నిధులు లేక నీరసించి..

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 2015-16లో రూ.50 లక్షలతో అనిల్‌గార్డెన్‌ సమీపంలోని పార్క్, 2016-17లో వీబీఎస్‌ కల్యాణ మండపం దగ్గర పనులు పూర్తి చేశారు. అనంతరం 2017-20కు సంబంధించి వేపదరువు, కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు, రాజీవ్‌ గృహకల్ప ప్రాంతాల్లో రూ.1.39 కోట్లతో పార్కులు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. వీటిలో రూ.36 లక్షలతో ప్రహరీ నిర్మాణం మరికొన్ని పనులు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలు రావడం, కొవిడ్‌ తదితర కారణాలతో ఇప్పటివరకు పనులు చేపట్టలేదు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువును అభివృద్ధి చేసేందుకు రూ.30కోట్ల కేటాయించారు. వీటిలో గత ప్రభుత్వ హయాంలో రూ.12.4కోట్ల ఖర్చు చేసి పనులు చేశారు. దీనికి సంబంధించి ఇంకా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. నుడా చేపట్టిన పనులపై పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ పనులు చేపట్టకపోవడంతో చేసిన పనులన్నీ నిరుపయోగంగా మారాయి.

అమృత్‌ 2.0 ఎప్పుడు?

అమృత్‌-2లో ఉమ్మడి నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు.. కందుకూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, పురపాలికలు ఎంపికయ్యాయి. వీటిలో మూడు దశల్లో పనులు చేస్తుండగా.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మొదటి రెండింటిలోనే పూర్తి చేయనున్నారు. మొదటిదశలో కేవలం తాగునీటి వసతి కల్పనకు నిధులు వెచ్చించుకోవాల్సి ఉండగా.. అమృత్‌ 2లో తాగునీటి సౌకర్యంతో పాటు మరో మూడు పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. ఈ పథకం కింద ఘనవ్యర్థాల నిర్వహణ, చెరువులు, పార్కులు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం రెండు ఫేజ్‌ల్లో కలిపి రూ.296.72 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో మొదటి విడతలో బుచ్చిరెడ్డిపాళెం రూ.85 కోట్లు, అల్లూరు రూ.9.32 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. మిగిలిన వాటికి రావాల్సి ఉంది. రెండో ఫేజ్‌లో నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రతిపాదించిన రూ.167.30 కోట్లలో రూ.60.70 కోట్లు తాగునీటి సౌకర్యానికి, రూ.106.60 కోట్లు మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి మంజూరయ్యాయి. ఇప్పటివరకు అడుగులు ముందుకు పడలేదు.

చర్యలు తీసుకుంటాం

గతంలో కరోనా రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత బల్లులు రాలేదని గుత్తేదారులు పనులు నిలిపేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల వాటా సామ్మును బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుని చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం పనులు పూర్తి చేయడానికి గడువు పొడిగించింది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తాం.  

సి.గోపాల్‌రెడ్డి, ఎస్‌ఈ, ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని