logo

ముసుగు తొలగినా.. అదే నాటకం

ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు పరోక్షంగా వాలంటీర్లను వినియోగించిన వైకాపా- ఇక నుంచి ప్రత్యక్షంగా ప్రచారాస్త్రాలుగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మూకుమ్మడి రాజీనామాలు చేయించి..

Updated : 03 Apr 2024 05:52 IST

ప్రత్యక్ష ప్రచారం కోసం మూకుమ్మడి రాజీనామా
నగదు, ఉద్యోగం కల్పిస్తామని నాయకుల మాయమాటలు
ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

21వ డివిజన్‌లో రాజీనామా పత్రాలు చూపుతున్న వాలంటీర్లు

ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు పరోక్షంగా వాలంటీర్లను వినియోగించిన వైకాపా- ఇక నుంచి ప్రత్యక్షంగా ప్రచారాస్త్రాలుగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మూకుమ్మడి రాజీనామాలు చేయించి.. ఎన్నికల ప్రచారకులుగా వారిని మార్చేస్తోంది. ఆ క్రమంలో ఇష్టంలేనివారిని సైతం స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో బలవంతంగా రాజీనామా చేయించేలా పావులు కదుపుతోంది. పైకి మాత్రం.. ఈ నెల పింఛన్ల పంపిణీకి ఎన్నికల సంఘం తమను అనుమతించలేదని చెబుతుండటంతో పాటు.. వ్యక్తిగత కారణాలను చూపుతున్నారు. ఆ క్రమంలో జిల్లాలో సోమ, మంగళవారాల్లో పెద్దఎత్తున రాజీనామా పత్రాలు అందజేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. నిబంధనలు అతిక్రమించే విషయంలో ఉద్దేశపూర్వకంగానే పలువురు వాలంటీర్లు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

సహేతుక కారణం లేకుండానే...

సహేతుక కారణం లేకుండా.. నాటకీయంగా చేపట్టిన మూకుమ్మడి రాజీనామాల ప్రక్రియపై వాలంటీర్లలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైకి స్వచ్ఛందంగా తామే నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నా.. రాజీనామాలు చేసేటప్పుడు వారికి మద్దతుగా పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, వైకాపా నాయకులు వారితో పాటు ఎందుకు రావాల్సి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బృందాలుగా వచ్చి రాజీనామాలు సమర్పించినా.. బయటకు వచ్చాక.. వారు స్పందించే తీరులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం.. తెర వెనుక ఏం జరిగిందనే విషయం చర్చకు తావిచ్చేలా చేస్తోంది. విధుల్లో ఉండి.. ప్రచారం చేయడం నియమావళికి విరుద్ధం కావడంతో వైకాపా కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఆ విషయాన్ని నిజం చేస్తూ.. జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో సుమారు 350 మంది రాజీనామా పత్రాలు సమర్పించారు.

ఇంటింటికీ ఇవ్వాలని తెదేపా వినతి

రాజీనామా చేసిన వాలంటీర్లతో పాటు మరికొందరు తెదేపాపై విష ప్రచారం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే లబ్ధిదారులకు పింఛన్లు అందకుండా తెదేపా అడ్డుకుంటోందని గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. వాయిస్‌ రికార్డు చేసి.. లబ్ధిదారులకు పంపిస్తున్నారు. తెదేపా, జనసేన, భాజపా వల్ల తాము ఇంటికి పింఛను ఇవ్వలేకపోతున్నామని.... ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ సమాచారం పంపిస్తున్నారు. దీనిపై తెదేపా నాయకులు పలు ప్రాంతాల్లో వినతిపత్రాలు ఇచ్చారు. పింఛన్ల పంపిణీకి తాము వ్యతిరేకం కాదని, సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి పింఛను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. కావాలనే వైకాపా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.


గడిచిన రెండు రోజులుగా..

గ్రామ, వార్డు సచివాలయాల    పరిధిలో అధికార పార్టీ నాయకులు గడిచిన రెండు రోజులుగా వాలంటీర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధిష్ఠానం సూచన మేరకు ఎన్నికల్లో సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే క్రమంలో సంసిద్ధులను చేశారు. రాజీనామా చేసినా.. పార్టీ కోసం పనిచేసేవారికి వేతనంతో పాటు అదనంగా డబ్బు అందిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. దాంతో వారి పరిధిలో వైకాపాకు ఎక్కువ ఓట్లు పోలైతే ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. దాంతో నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఇతర మండలాల్లో పనిచేస్తున్న వారు రాజీనామా పత్రాలను నగర, పురపాలక కమిషనర్లతో పాటు గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నవారు మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులకు సమర్పించారు. సోమవారం వరకు తీసేసిన, మానేసిన వాలంటీర్లు 162 మంది ఉండగా- మంగళవారం నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో ఏకంగా 35 మంది, నార్త్‌రాజుపాళెంలో 25, మనుబోలులో 8, కావలిలో 100, కందుకూరులో 8 మంది రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు