logo

ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు

ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు.

Updated : 24 Apr 2024 05:12 IST

ఏడాదికిపైగా అనుమతి లేకుండా వైకాపా నాయకుల తవ్వకాలు
కోడ్‌ వచ్చినా.. కన్నెత్తి చూడని మైనింగ్‌, పోలీసు అధికారులు
ఈనాడు, నెల్లూరు

ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. అనుమతులు నిలిచిపోయి ఏడాది దాటినా దందా కొనసాగించిన అక్రమార్కులు.. చివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా దోపిడీకి తెరదించలేదు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీర్పును, రాష్ట్ర స్థాయి పర్యావరణ మదింపు సంస్థ ఆదేశాలను ధిక్కరించి.. నదీ గర్భంలోనూ తోడేశారు. సోమశిల దిగువ ప్రాంతం నుంచి విడవలూరు మండలంలో నది సముద్రంలో కలిసే వరకు పలుచోట్ల ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేశారు. మొదట్లో అడ్డుకునేందుకు యత్నించిన కొందరు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం.. బదిలీల పేరుతో వేధించడంతో.. ఆ తర్వాత వారు మాకెందుకులే అని పట్టించుకోవడమే మానేయగా.. అదే అదనుగా రూ.కోట్ల విలువైన ప్రకృతి సంపద దోచుకోవడంతో పాటు.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించారని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో దొరికే ఇసుకకు ఇతర ప్రాంతాల్లో భారీ గిరాకీ ఉండగా- వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై కన్నేసింది. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన వనరును.. జగన్‌ ప్రభుత్వం వ్యాపారంగా మార్చింది. అప్పటి వరకు అమల్లో ఉన్న విధానాన్ని రద్దు చేసింది. దీంతో ఇసుక బంగారంగా మారింది. అందుకు తగ్గట్టుగానే జిల్లాలోని పెన్నా పరీవాహకంలో 8 ఓపెన్‌ రీచ్‌లను గుర్తించింది. 2019 సెప్టెంబరులో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీఎండీసీ ద్వారా విక్రయాలు జరిపింది. ఆ తర్వాత మరో కొత్త విధానం తెచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. వెంటనే ఓ గుత్తేదారు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ నుంచి అధికార పార్టీ వ్యక్తులు.. జిల్లాలో ఇసుకను రూ. 21 కోట్లకు లీజుకు తీసుకున్నారు. దాన్ని చెల్లించడంతో పాటు అధికంగా లాభం పొందాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరదీశారు. 2022 డిసెంబరు నాటికి దాదాపు జిల్లాలోని అన్ని రీచ్‌ల గడువు ముగిసినా.. తవ్వకాలు మాత్రం ఆగలేదు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాతా పలు రీచ్‌ల్లో కొనసాగడం గమనార్హం.

నిబంధనలు ధిక్కరించి..

ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా.. మీటరు నుంచి మీటరున్నర లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. 10 నుంచి 15 అడుగుల వరకు తవ్వుతున్నారు. దీంతో భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని సమీప గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునేవారు లేరు. ఇసుక లారీల రాకపోకలతో పొర్లుకట్టలు ధ్వంసమవడంతో పాటు రోడ్లన్నీ గుంతలమయంగా మారుతున్నాయని ప్రజలు ఆందోళన చేస్తున్నా.. కొందరు స్థానిక అధికారులు గుత్తేదారులకే కొమ్ముకాయడం పరిపాటిగా మారింది. నిత్యం వందల లారీల రాకపోకల కారణంగా ఏర్పడుతున్న శబ్దాలతో నిద్రపోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినా.. అతివేగం కారణంగా పిల్లలకు ఏం జరుగుతోందనన్న ఆందోళన చెందుతున్నా.. జిల్లా అధికారులకు వినిపించడం లేదని ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక ఎక్కడికి? ఏ అవసరాలకు పోతుందో అన్నదీ నమోదు చేయడం లేదు. దీంతో పాటు సామర్థ్యానికి మించి నింపుతున్నామంటూ.. అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.

పల్లిపాడు ఇసుక రీచ్‌ నుంచి అధిక బరువుతో వెళుతున్న లారీ వెనుక ఎగసిపడుతున్న దుమ్ము.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు

అనుమతులు లేకుండా.. రూ. 641 కోట్లు స్వాహా

ప్రభుత్వ అనుమతి తీసుకున్న గుత్తేదారు సంస్థ గడువు ముగిసినా అదే పేరుతో దాదాపు ఏడాదిన్నర పాటు జిల్లాలో ఇసుక తవ్వకాలు జరిపింది. ఆ విషయం జిల్లాలో పనిచేస్తున్న మైనింగ్‌ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు అదిగో.. ఇదిగో అనుమతి వస్తుందంటూ.. తవ్వకాలను అడ్డుకోలేదు. ఫలితంగా రూ. కోట్ల విలువైన వనరు సరిహద్దులు దాటిపోయింది. జిల్లాలోని ఎనిమిది రీచ్‌ల్లో.. అయిదింటిలో నిత్యం తవ్వకాలు జరిగాయి. ఒక్కో చోట రోజుకు 200 లారీలు, 300 ట్రాక్టర్ల చొప్పున లెక్కవేసుకుంటే.. రోజుకు రూ. 28.5 లక్షల విలువైన సంపద దోచుకున్నారు. ఈ లెక్కన అయిదు రీచ్‌లకు కలిపి రూ. 1.42 కోట్లు కాగా.. 30 రోజులకు రూ. 42.75 కోట్లుగా తేలింది. ఈ విధంగా గడువు ముగిసిన నాటి నుంచి ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు 15 నెలల్లో రూ. 641.25 కోట్లు వైకాపా నాయకుల జేబుల్లోకి వెళ్లినట్లేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


ఇంట్లో.. బయట అంతా దుమ్మే
- జమ్‌షీర్‌, కల్తీకాలనీ

ఇసుక లారీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి పగలు తేడా లేకుండా అధిక బరువుతో తరలిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. దుమ్ము విపరీతంగా వస్తోంది. చివరకు గోడలు కూడా చిమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడైనా గట్టిగా నిలదీస్తే.. రెండు రోజులు రోడ్డును ట్యాంకర్‌ నీటితో తడుపుతారు. తర్వాత మళ్లీ మామూలే. మా సమస్య పరిష్కరించమని వేడుకోని నాయకుడు లేరు. ఇంట్లో, బయట రెండు చోట్ల ఉండలేని పరిస్థితి వచ్చింది. పిల్లలు అలర్జీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.


ప్రశాంతంగా అన్నం తినలేని పరిస్థితి
- మరియమ్మ, కోడూరుపాడు

ఇసుక లారీలతో ప్రశాంతంగా అన్నం తినలేని పరిస్థితి. బయట ఆరేసిన దుస్తులతో పాటు ఇంట్లోని కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలూ దుమ్ముతో నిండిపోతున్నాయి. వేగంగా వెళుతున్న లారీల పైనుంచి వచ్చిన ఇసుక గిన్నెల్లో పడుతోంది. దాంతో తినేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వేగంగా లారీలు వస్తుండటంతో.. పిల్లలను బయటకు పంపాలన్నా భయంగా ఉంటోంది. చాలాసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. పట్టించుకునేవారు లేరు. ఎన్నికలున్నాయి కదా.. మా ఇంటికి వచ్చి ఓటు అడిగే వారిని రోడ్డు సంగతి అడుగుదామని ఉన్నాం.  


పొర్లుకట్టలు ధ్వంసం
 - నెల్లూరు రవీంద్రారెడ్డి, మాజీ సర్పంచి, పల్లిపాడు

మా గ్రామ సమీపంలోని పెన్నానదిలో ఏళ్లుగా తవ్వకాలు జరుగుతున్నాయి. గతంలో మనుషుల సాయంతో చేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ యంత్రాలను వినియోగిస్తున్నారు. దాంతో పొర్లుకట్టలు ధ్వంసమయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో పల్లిపాడు మునిగిపోవడంతో పాటు తాగునీరు లేక ఎడారిగా మారే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని