logo

భువన్‌ సర్వేలో వెనుకంజ

నగర, పురపాలికల్లో ఇళ్ల నిర్మాణాల గుర్తింపులో యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టి భువన్‌ యాప్‌లో మ్యాపింగ్‌ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Updated : 13 Apr 2024 05:52 IST

దృష్టి సారించని అధికార యంత్రాంగం
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం 

యాప్‌లో నిర్మాణాల గుర్తింపు

నగర, పురపాలికల్లో ఇళ్ల నిర్మాణాల గుర్తింపులో యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టి భువన్‌ యాప్‌లో మ్యాపింగ్‌ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో పాత నగర, పురపాలికల్లో 94,311 ఇళ్లను ఉపగ్రహ పటాలను అనుసరించి గుర్తించారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కొత్త పురపాలికలు బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌లో చర్యలు కరవయ్యాయి.

సర్వే ఏమిటంటే..?

ఏటా భువన్‌ సర్వే పేరిట పురాల్లో నిర్మాణాలను పరిశీలించి కొలతలు తీసుకోవాలి. వాటిని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. గతంలో ఉన్న కొలతలు సవరించి వాటి స్థానంలో కొత్తగా తీసుకున్న వాటిని నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తికాకుంటే పురపాలికలు ఆదాయపరంగా నష్టపోతాయి. ఆస్తి పన్ను రూపంలో రావాల్సిన సొమ్ము రాదు. దృష్టి సారించాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఈ సమస్య అధిగమించాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించాలి. కొలతల ప్రక్రియ వేగవంతం చేయాలి. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చిత్రాలను పొందుపర్చాలి.

కొత్త నిర్మాణాలపై దృష్టి సారించాలి 

ఉమ్మడి జిల్లాలో పురాల్లో అనేక కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. శివారు కాలనీల్లో భారీ భవంతులు ఏర్పాటవుతున్నాయి. అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు అద్దెకు ఇస్తున్నారు. ఆస్తి పన్ను పరిధిలోకి రాకున్నా యజమానులు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి సారించాలి. కొలతలు సవరించి పన్ను విధించాలి. అప్పుడే పురాలు ఆర్థికంగా బలోపేతమవుతాయి.

సిబ్బంది కొరత..

నగర, పురపాలికల్లోని వార్డులు, డివిజన్ల సంఖ్యకు అవసరమైన బిల్‌కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది లేరు. ఉన్నవారిలో ఒక్కొక్కరు 3 నుంచి 6 వార్డులు/డివిజన్లను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఏటా మార్చి నెలాఖరు వరకు బకాయిల వసూళ్లకు వెళుతున్నారు. ఆ తర్వాత 5 శాతం రాయితీతో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. అనంతరం నూతన నిర్మాణాలకు పన్ను వేయడానికి దరఖాస్తులు వస్తేనే సిబ్బంది కాలుకదుపుతున్నారు. లేకుంటే 6 నెలల వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని