logo

రాతి గుహ నుంచి తీర్థం

నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా కొండ గుహలోంచి వచ్చే నీరును తీర్థం రూపంలో ఇక్కడి అర్చకులు అందిస్తారు. దేవుడి సృష్టిగా భక్తులు నమ్ముతారు.

Published : 13 Apr 2024 04:10 IST

నేటి నుంచి తొర్లికొండ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
న్యూస్‌టుడే, జక్రాన్‌పల్లి

స్వయంభూ శిలాతీర్థ వేంకటేశ్వర స్వామి

నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా కొండ గుహలోంచి వచ్చే నీరును తీర్థం రూపంలో ఇక్కడి అర్చకులు అందిస్తారు. దేవుడి సృష్టిగా భక్తులు నమ్ముతారు. ఈ నీరు వేసవిలో అధికంగా, వర్షాకాలంలో తక్కువగా వస్తుంది. ఇదే జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామంలోని స్వయం భూ శిలాతీర్థ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత.

ఆలయ చరిత్ర

తొర్లికొండ గ్రామంలోని కొండలపై స్వామి వారు వెలిశారు. పూర్వం ఊరిపైకి పెండారుదండు అనే దొంగల ముఠా దోపిడీలకు వచ్చినప్పుడు ప్రజలు తమ వద్ద ఉన్న విలువైన వస్తువులు, సామగ్రిని గుట్టపై ఉన్న ఆలయ కోటలోకి తీసుకెళ్లి తలుపులు మూసి దుంగలను అడ్డుగా పెట్టేవారు. ఆలయం చుట్టూ ఉన్న ఎత్తైన గోడ రక్షణ కవచంగా ఉండేది. తలుపులు తెరిచే వీలులేకపోవడంతో దొంగల నుంచి గ్రామస్థులు సురక్షితంగా ఉండేవారు. ఇలా ఇక్కడ కొలువైన వేంకటేశ్వర స్వామి భక్తుల కోర్కేలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు. గుహ నుంచి రోజు చిన్న బిందెడు పరిమాణంలో వచ్చిన నీటిని ఉదయం ఆరాధన సమయంలో సేకరిస్తారు. వైష్ణవులు ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి శనివారం ఇక్కడ పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో సౌకర్యాలను మెరుగుపరిచారు. ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొండపై చదును చేసి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఆలయ స్వాగత తోరణం

ప్రత్యేక కార్యక్రమాలు

ఏటా శ్రీరామనవమికి ముందు వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు తెలిపారు. 13న అంకురార్పణ, 14న ద్వారా తోరణం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు, 15న నిత్యహోమం, దొంగల దోపు కార్యక్రమాలు, 16న స్వామివారి కల్యాణం, 17న రథోత్సవం, 18న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని