logo

ఒక స్థానం.. నాలుగు జిల్లాల అధికారులు

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వెలువడనుంది.

Updated : 13 Apr 2024 05:52 IST

జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి జితేశ్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధూశర్మ

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వెలువడనుంది. ఈ లోక్‌సభ స్థానానికి కామారెడ్డి, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల అధికారులు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

బాధ్యతలు ఇలా..

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో మూడు మండలాలు కామారెడ్డి జిల్లాలో, మరో మూడు నిజామాబాద్‌ జిల్లాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం మొత్తం ఎన్నికల బాధ్యతలను నిజామాబాద్‌ ఎన్నికల అధికారి నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి మాత్రం మూడు మండలాలకు సంబంధించిన ఎన్నికల సిబ్బందిని ఎంపిక చేయడం, వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ మూడు మండలాలకు సంబంధించిన ఈవీఎంలను ఎన్నికల సిబ్బందికి అందజేయనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారే నిర్వహిస్తారు. ఇక సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఎన్నికలను సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి నిర్వహిస్తున్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఒక మండలం మెదక్‌ జిల్లాలో కొనసాగుతుంది. అయినప్పటికీ సంగారెడ్డి జిల్లా అధికారులే పర్యవేక్షణ చూసుకుంటున్నారు. ఇక అందోల్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నాలుగు మండలాలు సంగారెడ్డి జిల్లాలో, మరో మూడు మండలాలు మెదక్‌ జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎవరి పరిధిలో వారే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాల అధికారులే ఈవీఎంలు, ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నారు.

నామినేషన్ల స్వీకరణ సంగారెడ్డిలో..

పోలింగ్‌ ప్రక్రియ వరకు నాలుగు జిల్లాల అధికారులు బాధ్యతలు పంచుకుంటూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పటికీ నామినేషన్లు, ఓట్ల లెక్కింపు మాత్రం సంగారెడ్డి జిల్లాలోనే జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఇక పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సంగారెడ్డి జిల్లాకు తరలించనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరుస్తారు. అనంతరం జూన్‌ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు