logo

మద్యం మత్తు.. యువత చిత్తు

‘భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ఓ కల్లు దుకాణం ఆవరణలో గతంలో కొందరు యువకులు మద్యం మత్తులో పాఠశాల విద్యార్థినులను వేధించారు. సదరు విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

Published : 13 Apr 2024 04:13 IST

న్యూస్‌టుడే, భిక్కనూరు

‘భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ఓ కల్లు దుకాణం ఆవరణలో గతంలో కొందరు యువకులు మద్యం మత్తులో పాఠశాల విద్యార్థినులను వేధించారు. సదరు విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.’

‘భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామంలోని ఓ కల్లు దుకాణం ఆవరణలో ఉన్న ఈత వనం జూదరులకు అడ్డాగా మారింది. మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు నిత్యం అక్కడికి చేరుకుని మద్యం సేవిస్తూ చిత్తుబొత్తు ఆడుతున్నారు. శుక్రవారం తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన మహిళ అక్కడికి వచ్చి వారితో తీవ్ర వాగ్వాదం చేసింది. తన భర్త ఇంట్లో నుంచి వేల రూపాయలు తీసుకువచ్చి చిత్తుబొత్తులో పోగొట్టుకుంటున్నాడని అక్కడ ఉన్న వారితో గొడవపడింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని తిట్లదండకం ఎత్తుకుంది. వారం రోజుల క్రితం ఇలాగే డబ్బుల విషయంలో యువకులు గొడవపడితే గ్రామస్థులు వారిని హెచ్చరించి మరోసారి అక్కడికి రావొద్దన్నారు. అయినా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే మకాం వేస్తున్నారు.

జూదం, బెట్టింగ్‌, మద్యం మత్తులో గ్రామీణ యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కల్లు దుకాణాలు, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా ఏర్పరుచుకుని గుట్టుగా జూదం(చిత్తుబొత్తు) దందా నడిపిస్తున్నారు. రూ.వందలతో ప్రారంభమై వేలు, లక్షల్లో ఇది కొనసాగుతుంది. మద్యం మత్తులో వ్యసనాలకు బానిసై అప్పులు చేసి కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు. భిక్కనూరు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న దందాపై ప్రత్యేక కథనం.

ఆర్థికంగా కుదేలు

జూదానికి బానిసైన వారికి కొందరు డబ్బుల ఆశ చూపి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. రూ.వెయ్యి అప్పు ఇస్తే గంటకు వంద రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. డబ్బుల కోసం సెల్‌ఫోన్‌లు, ద్విచక్రవాహనాలు, బంగారం తనఖా పెట్టిన సందర్భాలు అనేకం. ఇంట్లో విషయం తెలిస్తే పరువు పోతుందని ఎవరికీ చెప్పుకోలేక కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బహిరంగంగా నడుస్తున్న దందాపై పోలీసులు మిన్నకుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బెట్టింగుల్లో పాల్గొని..

ఉదయం పూట జూదం, సాయంత్రం వేళ ఐపీఎల్‌ బెట్టింగుల్లో పాల్గొంటున్నారు. తిప్పాపూర్‌కు చెందిన వ్యక్తి, రామేశ్వరపల్లికి చెందిన మరో యువకుడు కీలకంగా వ్యవహరిస్తూ బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్నారు. డబ్బుల కోసం ఆశపడి బెట్టింగ్‌లో పాల్గొన్న ఓ యువకుడిని ఘటనా స్థలంలో చితకబాదిన సందర్భం ఉంది.


భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు 

సంపత్‌, సీఐ, భిక్కనూరు

యువత కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. నిషేధిత బెట్టింగ్‌, జూదంలో పాల్గొని మత్తు పదార్థాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా బెట్టింగ్‌, జూదం నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. కొన్ని ప్రదేశాలలో భిక్కనూరు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. అవసరమైతే కౌన్సిలింగ్‌ ఇస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని