logo

వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్ల జైలు

జిల్లాలో ఇటీవల అటవీ జంతువుల వేట విచ్చలవిడిగా సాగుతోంది. వేటగాళ్లపై దృష్టి సారించామని, వారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నామని జిల్లా అటవీ శాఖ అధికారిణి బోగ నిఖిత పేర్కొన్నారు. న్యూస్‌టుడే ఆమెతో ముఖాముఖి నిర్వహించగా పలు విషయాలను వెల్లడించారు.

Updated : 13 Apr 2024 05:48 IST

డీఎఫ్‌వో బోగ నిఖితతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి
న్యూస్‌టుడే, కామారెడ్డి నేరవిభాగం

జిల్లాలో ఇటీవల అటవీ జంతువుల వేట విచ్చలవిడిగా సాగుతోంది. వేటగాళ్లపై దృష్టి సారించామని, వారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నామని జిల్లా అటవీ శాఖ అధికారిణి బోగ నిఖిత పేర్కొన్నారు. న్యూస్‌టుడే ఆమెతో ముఖాముఖి నిర్వహించగా పలు విషయాలను వెల్లడించారు.

న్యూస్‌టుడే: జిల్లాలో అటవీ జంతువుల వేట కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఎఫ్‌ఓ:
అటవీ జంతువులను వేటాడితే వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లో వేటగాళ్ల ఆనవాళ్లు కనిపిస్తే పర్యవేక్షిస్తూ పట్టుకుంటున్నాం. జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 42 ప్రాంతాల్లో దాడులు చేసి ఉచ్చులు, వేట సామగ్రిని స్వాధీనం చేసుకొని పలువురిపై కేసులు నమోదు చేశాం.

వేసవికాలంలో వన్యప్రాణులకు నీటి వసతి ఎలా?
అడవిలోని ప్రతి 2 కిలోమీటర్ల దూరంలో నీటి వసతి ఏర్పాటు చేశాం. ఊట చెరువులు-చెక్‌డ్యాంలు, 361 సాసర్‌పిట్‌లు నిర్మించాం. వీటితో పాటు 4 సోలార్‌ బోర్‌బావులు కూడా ఏర్పాటు చేసి ఏడాది పొడవునా తాగునీటి సదుపాయం కల్పించాం. సాసర్‌పిట్‌లలో నిత్యం నీళ్లు నింపేలా చర్యలు చేపట్టాం.

ఎండాకాలంలో అటవీ సంపదకు ముప్పు వాటిల్లుతోంది. కార్చిచ్చుల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు?
గుర్తుతెలియని వ్యక్తులు అడవులకు నిప్పు పెట్టినా పూర్తిగా తగలబడకుండా ‘ఫైర్‌ లైన్స్‌’ అనే విధానాన్ని అమలుచేస్తున్నాం. ప్రతి అయిదు మీటర్ల దూరంలో ఉన్న ఆకులు, వ్యర్థాలను ఒకచోటకు చేర్చి కాల్చివేస్తాం. దీంతో భవిష్యత్‌లో ఎవరైనా నిప్పు పెట్టినా అక్కడికే మంటలు వ్యాపించి ఆగిపోతాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 25 కిలోమీటర్ల మేర ఫైర్‌లైన్స్‌ పూర్తి చేయడం జరిగింది.

అడవుల పునరుద్ధరణకు సంరక్షణ చర్యలు ఏమిటి?
మొక్కల పెంపకాన్ని నిరంతరంగా చేపడుతున్నాం. ఫలాలు, వెదురు మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నాం. పశువుల మేత కోసం కాపరులు అడవుల్లోకి రాకుండా పశు వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. కామారెడ్డి అటవీ డివిజన్‌ పరిధిలో 125 ఎకరాల విస్తీర్ణంలో పశు వనాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం.

పోడు పట్టాలే కాకుండా అటవీ భూముల ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. దీనిపై మీ చర్యలేమిటి?
పోడు పట్టాలిచ్చిన భూముల్లో గిరిజనులు యంత్రాలను వాడరాదు. వారి జీవనోపాధికి ఈ భూముల్లో పండిన పంటల దిగుబడులను వినియోగించుకోవాలి. జిల్లాలోని 16 వేల మంది గిరిజనేతరులు 16,500 ఎకరాల్లో అటవీ భూములను ఆక్రమించి సేద్యం చేస్తున్నారు. వీరు సైతం పోడు పట్టాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. ఆయా అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికి కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కేసులు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఆరు నెలల్లోనే అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడిన 11 మందిని బైండోవర్‌ చేయడంతో పాటు 64 కేసులు నమోదు చేయడం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని