logo

ఉపాధి డబ్బులకు నిరీక్షణ

రెక్కాడితే గాని డొక్కాడని ఉపాధి కూలీలు విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారికి పది వారాల నుంచి కూలీ సొమ్ము రావడం లేదు. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 13 Apr 2024 05:51 IST

10 వారాలుగా ఖాతాల్లో జమకాని వైనం
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

రెక్కాడితే గాని డొక్కాడని ఉపాధి కూలీలు విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారికి పది వారాల నుంచి కూలీ సొమ్ము రావడం లేదు. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే వ్యవసాయ పనుల సీజన్‌ ముగిసింది. కూలీలు ఎక్కువ సంఖ్యలో ఉపాధి బాట పట్టారు. కానీ, సకాలంలో డబ్బులు చేతికందక కుటుంబం గడవడం కోసం ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తోంది. గతంలో క్రమం తప్పకుండా డబ్బు జమయ్యేది. కానీ, ఒక్కసారిగా ఇబ్బందులు తలెత్తడంతో ఏమీ తోచని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. 

ఆర్థిక ఇబ్బందులు  : జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది కూలీలు ప్రస్తుతం ఉపాధి పనులకు వెళ్తున్నారు. కొన్ని మండలాల్లో మాత్రం ఫిబ్రవరి నెల డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. కానీ చాలా మందికి ఫిబ్రవరి నుంచి పైకం అందడం లేదు. అధికారుల సూచన మేరకు కూలీలు జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. డబ్బులు సకాలంలో అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి న్యాయం చేయాలని వాపోతున్నారు.

కొత్త సాఫ్ట్‌వేర్‌తో..

ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి నుంచి నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సాఫ్ట్‌వేర్‌ వాడేవారు. ఈ కొత్త విధానంతో డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమవ్వాలి. కానీ, కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా కూలీల డబ్బులు వారి ఖాతాల్లో జమైంది లేనిదీ బ్యాంకుకు వెళ్తే గానీ తెలుసుకోలేని పరిస్థితి. గతంలోని సాఫ్ట్‌వేర్‌ ద్వారా బ్యాంకుకు వెళ్లకున్నా డబ్బులు వచ్చింది రానిదీ తెలిసిపోయేది.

ఉపాధి కూలీలకు డబ్బులు రాకపోవడంపై ‘న్యూస్‌టుడే’ డీఆర్‌డీవో చందర్‌నాయక్‌ను వివరణ కోరగా.. డబ్బుల జాప్యానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.


‘ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉపాధి కూలీ పేరు నారాయణ. స్వగ్రామం రాజంపేట మండలం పొందుర్తి. ఈయన నిత్యం ఉపాధి పనులకు వెళ్తుంటారు. కానీ, కొన్ని నెలలుగా డబ్బులు రావడం లేదు. అధికారులు, బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సొమ్ము సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు