logo

ఛైర్‌పర్సన్‌ ఎన్నికపై ఉత్కంఠ

కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నెల 15న ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గురువారం కొంత మంది, శుక్రవారం మరికొందరు శిబిరానికి తరలి వెళ్లారు.

Updated : 13 Apr 2024 05:49 IST

శిబిరానికి తరలిన కౌన్సిలర్లు
కామారెడ్డి పట్టణం-న్యూస్‌టుడే

కామారెడ్డి పురపాలక సంఘ కార్యాలయం

కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నెల 15న ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గురువారం కొంత మంది, శుక్రవారం మరికొందరు శిబిరానికి తరలి వెళ్లారు. గత నెల అవిశ్వాస నోటీసు ఇచ్చాక కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గోవాకు వెళ్లారు. ఆ తర్వాత ఎనిమిది మంది భారాసకు చెందిన సభ్యులు కూడా జతగూడారు. వేర్వేరుగా శిబిరాలు నిర్వహించామని నాయకులు పేర్కొన్నారు. గత నెల 30న పురపాలికలో అవిశ్వాసం నెగ్గింది. 10 మంది భారాస సభ్యులు 27 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కలిసి ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిని గద్దె దించారు. ఈ ప్రక్రియకు 34 మంది అవసరం కాగా ముగ్గురు అదనంగా ఓటేశారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 4వ తేదీన అవిశ్వాసంపై గెజిట్‌ విడుదలైంది. 15న ఎన్నిక నిర్వహించేందుకు తేదీ ఖరారైంది. తాజాగా ఎన్నికకు రెండు రోజుల ముందు హైదరాబాద్‌లో శిబిరానికి వెళ్లారు.

తెరపైకి భాజపా

భాజపా నుంచి ఛైర్‌పర్సన్‌ బరిలో పోటీకి సిద్ధమని ఇప్పటికే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రకటించారు. ‘నిజాయతీ కలిగిన వ్యక్తిని ఎన్నుకుంటే సరి.. ఈ విషయంలో కౌన్సిలర్లంతా ఆలోచించాలి. లేదంటే భాజపా తరఫున ఛైర్‌పర్సన్‌కు పోటీ చేస్తాం’ అన్నారు. ఇప్పటికే భాజపాతో పలువురు ఇతర పార్టీల కౌన్సిలర్లు మంతనాలు జరుపుతున్నారు. మొత్తంమీద తొలిసారి కామారెడ్డి అవిశ్వాస ప్రక్రియ నెగ్గడం, ఆ తర్వాత నూతన ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు సన్నాహాలు చేయడం బల్దియా చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పలికినట్లయింది.

అధికారం దక్కేదెవరికో..?

ఛైర్‌పర్సన్‌గా అధికారం ఎవరికి దక్కేనో అని ఉత్కంఠ నెలకొంది. వైస్‌ఛైర్మన్‌తో పాటు మరో కౌన్సిలర్‌ ఈ పదవికి పోటీపడుతున్నారు. వీరిద్దరు కాదంటే మరో కౌన్సిలర్‌కు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శిబిరాల నిర్వహణకు రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష స్థానం ఎవరిని వరించేనో అని చర్చనీయాంశమైంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన భారాస సర్కారు కామారెడ్డిలో కూడా ఛైర్‌పర్సన్‌ పదవిని పోగొట్టుకుంది. ఈ ఎన్నికలో భారాస పాత్ర నామమాత్రమేనని తెలుస్తోంది. పాలకవర్గంలో బలాబలాలు క్రమంగా తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని