logo

నమ్మితే.. నెట్టింటా ముంచుతారు

ఇలా ప్రజలు అంతర్జాలంలో దేని కోసం వెతుకుతున్నారో సైబరాసురులు గుర్తించి దొంగ వెబ్‌సైట్లుతో వారిని చేరుకుంటారు. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకే ఇస్తామని ఆశచూపి అనుమానం రాకుండా మాటలు కలిపి నమ్మిస్తారు.

Updated : 13 Apr 2024 05:50 IST

న్యూస్‌టుడే, ఇందూర్‌ సిటీ

బోధన్‌ మండలం ఆచన్‌పల్లికి చెందిన ఓ వ్యాపారి ఫేస్‌బుక్‌ ఖాతాలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరిట ఓ ప్రకటన చూశారు. రిటైల్‌ ఫ్రాంచైజీ కోసంే  లింక్‌మీద నొక్కారు. తర్వాత వాట్సప్‌ కాల్‌ వచ్చింది. వివరాలతో కూడిన ధ్రువపత్రాలు కావాలని కోరడంతో వాటిని చేరవేశారు. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.25,500, తర్వాత రూ.48,500 చెల్లించాలని చెప్పడంతో పంపించారు. ఇలా మూడు విడతల్లో రూ 6.09 లక్షలు చేరవేశారు. తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

భీమ్‌గల్‌కు చెందిన ఒకరు ఫిబ్రవరి 6న బైండింగ్‌ తీగల కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. తర్వాతి రోజు గుర్తుతెలియని వ్యక్తి వాట్సప్‌లో బైండింగ్‌ తీగలు, మేకులకు సంబంధించిన చిత్రాలు పంపించాడు. అదేనెల 9న మరోసారి అవే చిత్రాలు పంపించాడు. 12న చిరునామా అడిగి వస్తువుల నాణ్యత గురించి మాట్లాడి కొంటానని నిర్ణయించుకున్నాడు. మోసగాడు బ్యాంకు ఖాతా వివరాలు పంపించగా మార్చి 27న రూ.లక్ష బదిలీ చేశాడు. తర్వాత మరో రూ.50 వేలు, రవాణాకు రూ.35 వేలు పంపాలని కోరగా మోసపోతున్నానని గుర్తించి 1930 నంబరులో ఫిర్యాదు చేశారు.

ఇలా ప్రజలు అంతర్జాలంలో దేని కోసం వెతుకుతున్నారో సైబరాసురులు గుర్తించి దొంగ వెబ్‌సైట్లుతో వారిని చేరుకుంటారు. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకే ఇస్తామని ఆశచూపి అనుమానం రాకుండా మాటలు కలిపి నమ్మిస్తారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలని, రవాణా ఖర్చులని నగదు లాగుతున్నారు. రోజులు గడిచినా వస్తువు రాకపోవడం, పదే పదే డబ్బులు అడగడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా లాభం లేకుండా పోతోంది. జిల్లాలో 2022లో 192, 2023లో 294 సైబర్‌మోసం కేసులు నమోదయ్యాయి. 

వీటిల్లో ఫిర్యాదుచేయాలి..

ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబరు లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఈ పని గంటలోపు చేస్తే పెద్దఎత్తున నష్టపోకుండా చర్యలు తీసుకునే తీసుకునే వీలుంటుంది. రూ.లక్షలోపు స్థానిక ఠాణాల్లో, రూ.లక్షపైన మోసం జరిగితే నిజామాబాద్‌ సీపీ కార్యాలయంలోని సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయాలి. 08462-227433, సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు 8712665554, సీఐ ముఖీద్‌ పాషా 87126 65587లను సంప్రదించాలి.

జాగ్రత్తలు పాటిస్తే మేలు..

  • అంతర్జాలంలో వచ్చే ప్రకటనలను పట్టించుకోకూడదు.
  • ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ ఎంచుకోవాలి. కంపెనీ చిరునామా అడిగి అక్కడ ఉందో లేదో ఆరా తీయాలి.
  • తెలియని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో లింకులు పంపిస్తే తెరవొద్దు.
  • స్టాక్‌ మార్కెట్‌్ పేరిట గ్రూపుల్లో అనుమతి లేకుండా చేర్చుతారు. వెంటనే అందులోంచి బయటకు వచ్చి రిపోర్టు చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని