logo

ఆత్మహత్యల కట్టడికి చర్యలేవీ?

ఇటీవల నవీపేట మండలం నాగేపూర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థి (18) చదువు అర్థం కావడం లేదని యంచ వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంతెన పరిసరాల్లో లేక్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టు ఉంటే సదరు విద్యార్థి ప్రాణాలు దక్కేవనే చర్చ జరుగుతోంది.

Updated : 13 Apr 2024 05:49 IST

యంచ గోదావరి వద్ద మృత్యుఘోష
న్యూస్‌టుడే, నవీపేట

ఇటీవల నవీపేట మండలం నాగేపూర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థి (18) చదువు అర్థం కావడం లేదని యంచ వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంతెన పరిసరాల్లో లేక్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టు ఉంటే సదరు విద్యార్థి ప్రాణాలు దక్కేవనే చర్చ జరుగుతోంది.

నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల సరిహద్దుల్లో పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తుంటారు.మరోవైపు వివిధ కారణాలతో నదిలో దూకి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆత్మహత్యలతో బాధిత కుటుంబీకులకు తీరని శోకం మిగులుతోంది. నవీపేట మండలం యంచ వంతెన వైపు మూడేళ్లలో 25 మంది, నిర్మల్‌ జిల్లా బాసర వైపు ఆరు నెలల్లో 44 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారధి మీదుగా నీటిలో దూకిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. నది పరిసర ప్రాంతాలు ఆత్మహత్యలకు కేంద్రంగా మారడంపై సమీప గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని అడ్డుకున్న యంచ యువకులు (పాతచిత్రం)

కాపాడుతున్న మత్స్యకారులు, యువకులు..

నదిలో నిత్యం మత్స్యకారులు చేపల వేట కోసం వస్తారు. నీళ్లలో దూకిన వారిని సమీపంలో ఉండే మత్స్యకారులు, అటుగా వెళ్లే యంచ యువకులు పదుల సంఖ్యలో తరచూ రక్షిస్తున్నారు. గతంలో ఓ యువతి, ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి వేర్వేరుగా నదిలో దూకగా.. యంచ మత్స్యకారులు యువతి, పిల్లల ప్రాణాలు కాపాడారు. నిజామాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు ప్రాణాలు కాపాడిన యువకులను అభినందించారు.

లేక్‌ పోలీస్‌ అవుట్‌పోస్టు అవసరం

యంచ - బాసర వంతెన వద్ద లేక్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో బాధితుల ప్రాణాలు తక్షణమే రక్షించే వీలు ఉంటుంది. సీసీ కెమెరాలు, వారధికి ఇరువైపులా వీధి దీపాలతో పాటు ఎత్తులో ఇనుప కంచెలు బిగిస్తే ఆత్మహత్యలను కొంతైనా నివారించవచ్చు.


నివారణ చర్యలు చేపట్టాలి

- ప్రవీణ్‌కుమార్‌, యంచ, గ్రామస్థుడు

నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల పాలనాధికారులు, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలి. ఈ మేరకు ఉన్నతాధికారులు, మంత్రులు, నియోజకవర్గ ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని