logo

జనావాసంలో పట్టాభిషేకం

శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం, ఆ సమయంలోనే యుద్ధం.. ఇలా ఎన్నో ఘట్టాలు ఎదుర్కొని రాజుగా పట్టాభిషేకం పొందారు. ఆయన పాలన, జీవించిన విధానం వంటివి ఎన్నో విలువైన సద్గుణాలను తెలియజేసేది రామాయణం.

Updated : 17 Apr 2024 06:18 IST

ఎన్నికలకు మిగిలింది కొద్ది రోజులే
అభ్యర్థులకు ఈసీ నిర్దేశించిన ఎన్నికల వ్యయం : రూ.95 లక్షలు

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌ :  శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం, ఆ సమయంలోనే యుద్ధం.. ఇలా ఎన్నో ఘట్టాలు ఎదుర్కొని రాజుగా పట్టాభిషేకం పొందారు. ఆయన పాలన, జీవించిన విధానం వంటివి ఎన్నో విలువైన సద్గుణాలను తెలియజేసేది రామాయణం. అంతటి మహత్తర రామాయణంలోని ఎన్నో విషయాలు నేటికీ ఆచరణీయమే. ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల ఘట్టం మొదలైంది. పాలకులను ఎన్నుకునే పోలింగ్‌ ప్రక్రియ రామాయణంలోని కొన్ని ఘట్టాలకు సరిగ్గా నప్పుతుంది. ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల ప్రక్రియ, ఆ తర్వాత ప్రజల మధ్యకెళ్లి ప్రచారం చేయడం. పోలింగ్‌ రోజు ఓటర్లంతా ఓటేసి పట్టాభిషేకం చేస్తారు. ఆ రోజు బరిలో ఎవరికి ఎక్కువ ఓట్లేస్తే వారికే పట్టం కట్టినట్లు కౌంటింగ్‌ రోజు తేలిపోతుంది. ఈ పట్టాభిషేకానికి ముందు కొన్ని ఘట్టాలను అభ్యర్థులు దాటాల్సి ఉంటుంది. వాటిని శ్రీరామనవమి సందర్భంగా పోటీదారులు ప్రచార వ్యూహానికి అన్వయించుకుని ముందుకు సాగాలి.

తండ్రి ఆదేశం ప్రకారం రామయ్య వనవాసానికి వెళ్లారు. ఇప్పుడు పార్టీలు అభ్యర్థులు తమ అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లాలి. అందుకు దాదాపు ఏప్రిల్‌ 18 నుంచి మే రెండో వారం వరకు జనావాసం చేయాల్సిందే. సాధ్యమైనంత ఎక్కువ మందిని కలిసి వారి అభిమానాన్ని కూడగట్టుకోవాల్సి ఉంటుంది. అలనాడు రాముడి వనవాసం దండకారణ్యంలో సాగితే... నేడు అభ్యర్థులు జనారణ్యంలో కొనసాగాలి. అప్పుడే ఓటర్లు పట్టం కడతారు.

అభిమాన సైన్యం

రాముడు తన అటవీ క్షేత్రంలో ప్రతి సంఘటనను జయించడానికి ఆయనతో పాటు కొందరు సైనికుల్లా తమవంతు పాత్ర పోషించి రామచంద్రుడిపై తమ భక్తిని, అభిమానాన్ని చాటుకున్నారు. తమ స్థాయిలో పనులు చక్కబెట్టి రాముడి విజయానికి బాటలు వేశారు. ఇప్పుడు నాయకులు సైతం అంత చిత్తశుద్ధితో పనిచేసే సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి. విభిన్న నేపథ్యం ఉన్నా... రాముడికి సమన్వయంతో సేవలందించిన తీరును అనుసరించాలి. యుద్ధంలో గెలిచి అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు అందరినీ కలుపుకొని వెళ్లాలి.

మండలం, నియోజకవర్గం ఇలా వివిధ హోదాలు ఉన్నా పార్టీల్లో బూత్‌స్థాయిలో కన్వీనర్లే ప్రధాన సైనికులు. అలా ఒక్కో పార్టీకి ఒక్కో కన్వీనర్‌ ఉంటారు.

ధర్మ విధానం

రాముడు తన ధర్మం కోసమే చివరి వరకు పోరాడినట్లు చెబుతారు. కుటుంబంలో అందరి మద్దతు ఉన్నా.. ఎవరు ఎన్ని చెప్పినా ధర్మం ప్రకారం వనవాసం అయ్యాకనే పాలన చేపట్టాడు. అభ్యర్థులు ఎన్నికల బరిలో ధర్మ మార్గంలో... అంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన పద్ధతిలో పోటీని ఎదుర్కోవాలి. ప్రలోభాలతో ఓటర్ల మనసు గెలిచే ప్రయత్నం ధర్మం కాదని ఎన్నికల నియమావళి చెబుతుంది.

దుష్ప్రచారానికి దూరం

యుద్ధాన్ని నీతిగా గెలవాలి. రాముడు తన జీవిత కాలంలో అదే పాటించాడు. ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కువ ప్రమాదకరం ఈ దుష్ప్రచారమే. పోటీలో గెలవడానికి ప్రలోభాలు ఒక ఎత్తైతే ప్రత్యర్థిని దెబ్బ తీయడానికి టెక్నాలజీని వాడుకుని అనుకరణలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిస్తుంటారు. విద్వేషపూరితమైన వాటికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించే ప్రయత్నాలు సాగుతుంటాయి. అవి ఒక్కోసారి ప్రచారం చేసిన వారికే చేటు చేసే అవకాశం ఉంది.

 ఇప్పటికే జిల్లాలో పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా... క్షేత్రస్థాయిలో సామాజిక మాధ్యమాల్లో తమ అభిమాన నాయకుల విషయంలో పోటాపోటీగా వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. తక్కువ నిడివి వీడియోలతో దుష్ప్రచారం పెరుగుతోంది.

వేగులతో వ్యూహం

రాముడిని యుద్ధంలో బలహీనపరచడానికి పలువురిని పురమాయించాడు రావణుడు. ఎన్నికల క్రతువులోనూ అలాంటి ఎత్తులు కొనసాగే ఆస్కారముంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాక అంతర్గత సమావేశాల్లో ఇవే విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు ఒక వాదన. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నాయకులు కాస్త అప్రమత్తమయ్యారు.

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు : 7 ఓటర్లు : 16,89,957

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటేసేందుకు అర్హులు

  •  ఆర్మూర్‌ : 2,10,734
  •  బోధన్‌ : 2,21,314
  •  బాల్కొండ : 2,25,260
  •  నిజామాబాద్‌ అర్బన్‌ : 2,99,647
  •  రూరల్‌ : 2,54,136

లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌లు : 1,807
మూడు పార్టీలకు కలిపి అవసరమైన కన్వీనర్లు 5,421

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని