logo

19న ఇద్దరు.. 22న మరొకరు

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 18న విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల (నామపత్రాలు) దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Published : 17 Apr 2024 04:15 IST

లోక్‌సభ నామపత్రాల దాఖలు తేదీలు ఖరారు 

ఈనాడు, నిజామాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 18న విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల (నామపత్రాలు) దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి మూడు ప్రధాన పార్టీల తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థులు ఇప్పటికే ఓట్ల సమరానికి సన్నద్ధమయ్యారు. నిత్యం పార్టీ శ్రేణులతో సమావేశమవుతూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. భాజపా, భారాస అభ్యర్థులు 19వ తేదీన, కాంగ్రెస్‌ అభ్యర్థి 22న నామినేషన్‌ దాఖలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయా పార్టీల నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ముఖ్య నాయకుల రాక..

భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ఈ నెల 19న పేరు, బలం ఆధారంగా నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమం సాదాసీదాగా ఉండనుంది. ఈ నెల 25న మరోమారు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజు ర్యాలీ, సభ ఉండనుందని సమాచారం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారని సమాచారం. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా 19వ తేదీనే నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. భారాస నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరవుతారని చెబుతున్నారు. 22న కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్‌ పెద్దలు హాజరవుతారని తెలుస్తోంది. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రెండు బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఒకటి అభ్యర్థి నామినేషన్‌ రోజునే నిజామాబాద్‌ నగరంలో నిర్వహించాలనే ఆలోచన జిల్లా పార్టీ చేస్తోంది. ఆ రోజు వీలుకాకుంటే సభ తేదీ మారే అవకాశం ఉంది. దీనిపై బుధవారం స్పష్టత రానుంది.

విమర్శనాస్త్రాలతో వేడి..

ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్థులు ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ సవాళ్లు విసురుతున్నారు. ఇందుకు పార్టీ సమావేశాలే కాకుండా విలేకర్ల సమావేశాలు, ప్రసార మాధ్యమాల్లో ఇంటర్వ్యూలను వేదికగా చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థుల వైఫల్యాలు, తమకు అవకాశం ఇస్తే ఏం చేస్తామనే విషయాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఇక హోరెత్తనుంది..

మూడు పార్టీలు వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటంపైనే దృష్టిసారించాయి. ఇకపై జనంలోకి వెళ్లే విధంగా ప్రచార కార్యాచరణ అమలు చేయనున్నాయి. ఇందుకోసం పార్టీలు పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయ కమిటీలను వేస్తున్నాయి. ఆయా కమిటీలు మండలాల వారీగా ఉన్న కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ప్రచార పర్వాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు తెలుస్తోంది. నామపత్రాల దాఖలు తర్వాత ప్రచార సామగ్రి మండలాల వారీగా పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని