logo

‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి’

పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్‌ పార్లమెంట్‌ భారాస ఎంపీ అభ్యర్థి  బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆరోపించారు.

Published : 18 Apr 2024 05:17 IST

మాట్లాడుతున్న భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, చిత్రంలో వీజీ గౌడ్‌

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్‌ పార్లమెంట్‌ భారాస ఎంపీ అభ్యర్థి  బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైందని.. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి ప్రకటన చేయడం ఓట్లు దండుకోవడం కోసమేనని పేర్కొన్నారు. రైతులు పండించిన పంట ప్రభుత్వం కొనే పరిస్థితిలో లేదని, అందుకే ప్రైవేటులో అమ్ముకుంటున్నారని తెలిపారు. రైతుబంధు ఇప్పటికీ రాలేదని, వరికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదని పేర్కొన్నారు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. భాజపా అభ్యర్థి అర్వింద్‌ సోషల్‌ మీడియాలో తప్ప ప్రజలతో కలిసి ఉండటం లేదని ఎద్దేవా చేశారు. మాధవనగర్‌ వంతెన నిర్మాణానికి రూ.90 కోట్లు తెచ్చానని గొప్పలు చెబుతున్నాడని, అందులో రూ.60 కోట్లు అప్పటి భారాస ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏ ఒక్కరోజు జిల్లాకు రాలేదన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే తనను గెలిపించాలని కోరారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12.05 గంటలకు కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వస్తారని వెల్లడించారు. పాత కలెక్టర్‌ మైదానంలో బహిరంగ సభ ఉంటుందని వివరించారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ.గౌడ్‌, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్‌, నుడా మాజీ ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, భారాస నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సుజీత్‌సింగ్‌ ఠాకూర్‌, మురళి, గోపి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని