logo

నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది.

Updated : 18 Apr 2024 06:23 IST

నేటి నుంచి బీఈడీ కళాశాలల తనిఖీలు
న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది.

వర్సిటీ పరిధిలోని ఓ పట్టణంలో రెండు బీఈడీ కళాశాలలు ఒకే భవనంలో నడుస్తున్నాయి. తనిఖీ బృందం వచ్చినప్పుడు మాత్రం వేర్వేరుగా చూపిస్తారు.

పట్టణంలో ఉన్న బీఈడీ కళాశాల కన్వీనర్‌ కోటలో సీటు వచ్చిన విద్యార్థులకు అధిక ఫీజులు కట్టాలని చెప్పి వెనక్కి పంపి ఖాళీగా చూపుతుంది. తర్వాత మేనేజ్‌మెంట్‌ కోటాలో అధిక డబ్బులకు భర్తీ చేస్తుంది. అయినా అధికారులు పట్టించుకోరనే లేదనే విమర్శలు ఉన్నాయి.

నూతన(2024-25) విద్యా సంవత్సరానికి బీఈడీ కళాశాలల అనుబంధ గుర్తింపునకు తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులు గురువారం నుంచి తనిఖీలు చేపట్టనున్నారు. వర్సిటీ పరిధిలో ఉమ్మడిజిల్లాలో 15 కళాశాలలున్నాయి. సారంగాపూర్‌ ఎడ్యుకేషన్‌ ఒకటి ప్రభుత్వ కళాశాల. మిగిలిన 13 బీఈడీ, ఒకటి బీపీఈడీ ప్రైవేటువే. గతేడాది 9 మాత్రమే ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో చేరాయి. సౌకర్యాలు లేకపోవడంతో ఆరింటిని చేర్చలేదు. తర్వాత కొద్ది రోజులకు వీటికి అనుమతిచ్చారు. ఈసారి ఎన్నింటికి గుర్తింపునిస్తారో.. చూడాలి మరీ.

ఇవి పాటించాలి...

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం బీఈడీ కళాశాలకు సొంత భవనం ఉండాలి. 100 మంది విద్యార్థులకు 16 మంది అధ్యాపకులు అవసరం. ప్రిన్సిపల్‌ పీహెచ్‌డీ పట్టా పొంది ఉండాలి. కళాశాల భవనం, ల్యాబ్‌, మౌలిక వసతులు ఇలా పలు అంశాలు పరిశీలిస్తారు. ఈ ఏడాది అఫిలియేషన్‌ పొందిన 8 కళాశాలల్లో కొన్నింటిలో పూర్తిస్థాయి వసతులు లేవని ఓ ప్రిన్సిపల్‌ చెప్పడం గమనార్హం. 16 మంది అధ్యాపకులు ఉండాల్సిన చోట 10 మంది కూడా ఉండటం లేదు. అర్హత కలిగిన ప్రిన్సిపల్‌ పేరును, అధ్యాపకుల జాబితా చూపి అనుమతులు పొందుతున్నట్లు గతంలో తనిఖీ బృందం పరిశీలనలో బహిర్గతమైంది. బృందాలు వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ప్రిన్సిపల్‌, అధ్యాపకులను రప్పించి చూపిస్తున్నారు. తర్వాత వీరు కళాశాలలో మచ్చుకు కూడా కనిపించరు. తనిఖీ బృందం వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉండటంతో రాత్రికి రాత్రే అన్నీ సిద్ధం చేస్తారు. ఇలాంటి వ్యవస్థలో భావితరానికి దిశానిర్దేశం చేసే ఛాత్రోపాధ్యాయులు ఎలా తయారవుతారని పలువురు మండిపడుతున్నారు.

ముందస్తుగా ఎందుకు..?

ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష జూన్‌లో ఉంటుంది. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌, నవంబరు-డిసెంబరులో బీఈడీ తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ బీఈడీ కళాశాలల తనిఖీలకు షెడ్యూల్‌ ఇవ్వలేదని, తెవివిలో మాత్రం ముందస్తుగా చేపట్టడం ఏంటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నూతన వీసీల నియామకం పూర్తయిన తర్వాతనే తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.


పారదర్శకంగా చేపడతాం

- ఆచార్య ఘంటా చంద్రశేఖర్‌, తెవివి అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌

బీఈడీ కళాశాలల తనిఖీ పూర్తి పారదర్శకంగా చేపడుతాం. ఎన్‌సీటీఈ నిబంధనలకు లోబడి పూర్తి వసతులు, బోధకులతో నడుస్తున్న కళాశాలకు మాత్రమే గుర్తింపు ఇస్తాం. దీనిపై ముందస్తుగానే కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలిచ్చాం. గుర్తింపు ఉన్న కళాశాలలకే స్కాలర్‌షిప్స్‌ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలికి లేఖ పంపుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని