logo

ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసం

ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Updated : 25 Apr 2024 06:24 IST

పుర ఛైర్మన్‌ సత్యనారాయణకు కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న మంత్రి రాజనర్సింహ, చిత్రంలో ఎమ్మెల్యే   మదన్‌మోహన్‌, ఎంపీ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌

ఈనాడు, కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పుర ఛైర్మన్‌ సత్యనారాయణ భారాసను వీడి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమక్షంలో హస్తం కండువా కప్పుకొన్నారు. మరోవైపు భారాస కౌన్సిలర్లు ఇతర సభ్యులతో కలిసి ఛైర్మన్‌పై బుధవారం కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు అందించారు. దీంతో పురపాలక సంఘం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

బల్దియాలో పార్టీల బలాబలాలు

పురపాలికలో మొత్తం 12 వార్డులుండగా 2019లో జరిగిన ఎన్నికల్లో భారాస 9, కాంగ్రెస్‌ 3 వార్డుల్లో విజయం సాధించాయి. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు సైతం భారాసలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. ప్రస్తుతం ఛైర్మన్‌ పనితీరుపై అసంతృప్తి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు సుజాతతో పాటు ఎనిమిది మంది సభ్యులు అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.

ఏడాది కిందట ప్రయత్నాలు

ఏడాది కిందట ఛైర్మన్‌ సత్యనారాయణ పనితీరుపై అసంతృప్తి చెందిన భారాస కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పటి ఎమ్మెల్యే సురేందర్‌ కౌన్సిలర్ల మధ్య సయోధ్య కుదుర్చడంతో అవిశ్వాస ప్రయత్నాలను సభ్యులు విరమించుకున్నారు. ఇటీవల కామారెడ్డి పురపాలికలో ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గడంతో ఎల్లారెడ్డిలో సైతం అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు

ఛైర్మన్‌ పదవి ఆశిస్తున్న వ్యక్తి తనకు మద్దతు ప్రకటిస్తున్న కౌన్సిలర్లను శిబిరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారాస నేతల సూచనల మేరకు కౌన్సిలర్లు ఛైర్మన్‌ సత్యనారాయణపై అవిశ్వాసానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఛైర్మన్‌ పార్టీ మారడంతో.. భారాసకు మద్దతు తెలుపుతున్న కౌన్సిలర్లు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో అవిశ్వాసం సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. కలెక్టర్‌ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని