logo

ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం

ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్‌ కమిషన్‌ 1950 కాల్‌సెంటర్‌, సీ-విజిల్‌ యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే

Updated : 25 Apr 2024 06:23 IST

సీ-విజిల్‌, 1950 కాల్‌సెంటర్లకు ఆదరణ
ఈనాడు, కామారెడ్డి

కంట్రోల్‌రూంలో 1950 కాల్‌సెంటర్‌లో అధికారులు  

ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్‌ కమిషన్‌ 1950 కాల్‌సెంటర్‌, సీ-విజిల్‌ యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు, రాజకీయ నేతల ఉల్లంఘనలు తదితరాలపై ఫిర్యాదులు వస్తున్నాయి.

గ్రామాల నుంచే ఎక్కువ..

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతల హడావుడి కొంతమేర తక్కువగానే ఉంది. కానీ, అక్కడక్కడ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా పల్లెల నుంచే ఉంటున్నాయి. రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఎన్నికల సమయంలో ఎన్ని మద్యం సీసాలు ఇంటిలో నిల్వ ఉంచుకునే వీలుందని కాల్‌సెంటర్‌ నిర్వాహకులను అడిగారు. మాచారెడ్డి మండలం ఫరీద్‌పేటకు చెందిన మరొకరు ద్విచక్రవాహనంపై పార్టీ జెండా పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలా? అనే సందేహం వెలిబుచ్చారు. మద్నూర్‌ మండలానికి చెందిన ఒకరు ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు ఎరవేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఎన్నికలు ముగిసే వరకు సేవలు

జిల్లాలో ఓటరు సహాయ కేంద్రం (1950) సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

పారదర్శకతకు పెద్దపీట  

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సీ- విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేస్తే అది ఎన్నికల సంఘానికి చేరుతుంది. అందులో ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలోని మానిటరింగ్‌ సెల్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి ఐదు నిమిషాల్లో క్షేత్ర పరిశీలనలోని ఎంసీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలకు చేరుతుంది. ఆయా అధికారులు అందిన ఫిర్యాదులపై 15 నిమిషాల్లో క్షేత్రస్థాయి విచారణ చేస్తారు. ఆ నివేదికను 30 నిమిషాల్లో రిటర్నింగ్‌ అధికారికి వెళ్లేలా నమోదు చేస్తారు. దానిని రిటర్నింగ్‌ అధికారి 50 నిమిషాల్లో పరిశీలించి ఉల్లంఘన జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఓటీపీతో నమోదు

ఫిర్యాదుదారుడు 1950 నంబరుకు కాల్‌ చేసినప్పుడు అతని పేరు, ఫోన్‌ నంబరు, వ్యక్తిగత వివరాలు సిబ్బంది అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అతడి ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ పంపిస్తారు. దాన్ని సిబ్బందికి తెలియజేస్తే వారు ఫిర్యాదు చేసుకుని సమస్యను సంబంధిత విభాగానికి చేరవేస్తారు. ఆపై సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఎన్నికల అధికారి రోజువారి సమీక్ష నిర్వహిస్తున్నారు. నిర్దేశిత సమయంలో పరిష్కరించకపోతే అందుకు గల కారణాలను నోడల్‌ అధికారి రాతపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది.

ఫిర్యాదుల వివరాలు

అంశం అందినవి
1950  493
సీ- విజిల్‌  40

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని