logo

సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం

లోక్‌సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు.

Updated : 25 Apr 2024 06:23 IST

ప్రధాన పార్టీల వ్యూహాలు
ఈనాడు, నిజామాబాద్‌

లోక్‌సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. వీరంతా ప్రచారంలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. అవకాశం ఉన్న అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రభావం చూపే వర్గాలే లక్ష్యంగా హామీలిస్తున్నారు. తమ విధానాలు వివరిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు పోటీ పడుతున్నారు. పార్టీల ముఖ్య నేతలు సభలకు వస్తుండటంతో ప్రచారం హోరెత్తుతోంది.

పరస్పరం పోటీపడుతూ..

పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటంతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇదే క్రమంలో ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇందూరు ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములవుతారు. ఈ సందర్భాన్ని నాయకులంతా తమకు చిక్కిన అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. సాధారణంగా ప్రత్యర్థులంతా వేర్వేరు చోట్ల తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటారు. కానీ, మూడు పార్టీల అభ్యర్థులు శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొని భక్తుల మధ్యే గడిపారు. చూసేవారికి స్వామికార్యం, స్వకార్యం రెండు ఒకేచోట అన్నట్లుగా కనిపించటం విశేషం.

సభలతో ఉత్సాహం..

నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఓటర్లకు హామీలు ఇవ్వడంతో పాటు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని శ్రేణులకు సూచించారు. ఆ పార్టీ నాయకులు ప్రచార ఘట్టంలో ఉత్సాహంగా కదులుతున్నారు. భారాస సైతం నామినేషన్‌ దాఖలు సందర్భంగా సభ నిర్వహించింది. ఈ సందర్భంలో హాజరైన నాయకులు ఉద్యమ కాలం నాటి ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. వీరంతా ప్రచారంలో భాగమవుతున్నారు. నియోజకవర్గంలో ముందస్తుగా ప్రచారం మొదలెట్టిన భాజపా, జగిత్యాలలో మోదీ సభను నిర్వహించింది. పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు. రెండో విడతగా మరో ఎన్నికల సభను గురువారం నిజామాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సభకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ హాజరవుతున్నారు. భారీ జనసమీకరణ చేయాలని భాజపా సన్నాహాలు చేస్తోంది.

ప్రభావిత వర్గాలను కలుస్తూ..

మూడు పార్టీల నేతలు ప్రభావం చూపే సామాజికవర్గాల పెద్దలను కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. వీరి ఓట్లు పెద్దసంఖ్యలో ఉండటంతో తమ పార్టీకే వేసేలా సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వివరిస్తూ.. ఎవరికి వారు తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. సంప్రదింపుల సమయంలో హామీలూ ఇస్తున్నారు. వచ్చిన చిక్కాల్లా ఏంటంటే..కలుస్తున్న ప్రతి అభ్యర్థితో ఆయా వర్గాల పెద్దలు సానుకూలంగానే మాట్లాడి పంపిస్తున్నారు. చివరికి వీరు ఎటువైపు నిలుస్తారు? సామాజికవర్గం వాళ్లు వారు వీరి మాటకు కట్టుబడి ఓట్లు వేస్తారా? అనే సందేహాలు నాయకుల్లోనూ వ్యక్తమవుతుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని