logo

ప్రగతి పరిశీలన..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్‌ఆర్‌డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

Published : 21 May 2024 05:01 IST

ఐదు గ్రామాల్లో పర్యటిస్తున్న ఎంసీహెచ్‌ఆర్‌డీ బృందం

పల్లెల్లో సర్వే చేసేందుకు వచ్చిన ఎంసీహెచ్‌ఆర్‌డీ బృందం సభ్యులు 

ఈనాడు, కామారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్‌ఆర్‌డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ‘విలేజి విమర్శ’ పేరుతో చేపడుతున్నారు. సర్వే చేయడానికి మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్‌డీ) ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మా ద్వారా ప్రశ్నలు సంధించి జవాబులు రాబట్టనున్నారు. 

అభివృద్ధి చెందినవి ఎంపిక..

అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఎంసీహెచ్‌ఆర్‌డీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో వేటితో పల్లె ప్రజలకు ప్రయోజనం కలుగుతుందోనని సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 27 మంది సభ్యుల బృందం జిల్లాలోని పద్మాజీవాడి, ఫరీద్‌పేట, నర్సన్నపల్లి, దోమకొండ, శివాయిపల్లి గ్రామాల్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పథకాల అమలు ప్రయోజనాలపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోంది. ముఖ్యంగా పల్లె ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడుతున్నాయనే దానిపై సమాచారం సేకరించనున్నారు. కాని అభివృద్ధి పరంగా ఆదర్శంగా ఉన్న గ్రామాలనే అధికారులు సర్వేకు ఎంపిక చేయడం గమనార్హం. మారుమూల పల్లెలను ఎంపిక చేస్తే వాస్తవ పరిస్థితి పరిశీలన బృందాలకు తెలిసేదనే వాదన ఉంది.

లబ్ధిదారులతో సమావేశాలు..

ముఖ్యంగా సర్వేలో ఉపాధి హామీ, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన, సౌర విద్యుదుత్పత్తి పథకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, ప్రగతి పథకాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని