logo

ఫలితాలు మెరుగయ్యేనా..?

ఇంటర్మీడియట్‌ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది.

Published : 21 May 2024 05:12 IST

24 నుంచి ఇంటర్‌ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం: ఇంటర్మీడియట్‌ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. ప్రథమ సంవత్సరంలో 7,658కి 2,666, ద్వితీయ సంవత్సరంలో 7,234కి 3,204 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండింట్లో జిల్లాకు 35వ స్థానం దక్కింది. 24వ తేదీ నుంచి 29 కేంద్రాల్లో ఇంటర్మీడియట్‌ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను విద్యార్థులు రాయనున్నారు. పడిపోయిన ఫలితాలు మెరుగయ్యేందుకు ప్రస్తుతం జరిగే పరీక్షలపై అధికారులు దృష్టిపెట్టారు.

ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ..

ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో అనుత్తీర్ణులైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు నిపుణులు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 29 మంది ముఖ్య పర్యవేక్షకులు, 29 మంది విభాగ పర్యవేక్షకులు, 4 సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. తరగతి గదుల్లో చీకటి లేకుండా విద్యుత్తు సౌకర్యం కల్పించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, ఫ్యాన్లు తదితర వసతులు కల్పించారు. 

హాల్‌టికెట్లు పొందాలి

సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులు సంబంధిత కళాశాలలో హాల్‌టికెటు పొందాలని లేదా ఇంటర్‌ విద్యాశాఖ పోర్టల్‌ నుంచి హాల్‌టికెట్లు తీసుకుంటే దానిపై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, చరవాణికి అనుమతి లేదు.


ఆందోళన చెందొద్దు

షేక్‌ సలాం, ఇంటర్‌ జిల్లా విద్యాధికారి

సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు ఆందోళన చెందొద్దు. పరీక్ష హాల్‌లో ప్రశాంతంగా ఉండాలి. ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత పది నిమిషాల పాటు క్షుణ్ణంగా చదివి సమాధానాలు రాయాలి. కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించనున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని