logo

నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి

మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు.

Updated : 21 May 2024 05:51 IST

‘ఈనాడు’తో పాలనాధికారి జితేశ్‌ వి పాటిల్‌

మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనులతోపాటు పెండింగ్‌లోని భూ సమస్యలు పరిష్కరించేందుకు చేపడుతున్న కార్యాచరణ గురించి ‘ఈనాడు’ నిర్వహించిన ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు. వారి మాటల్లోనే..

ఈనాడు, కామారెడ్డి


ఈనాడు: మిల్లర్లు నిబంధనలు అతిక్రమించి నాణ్యత సాకుతో తరుగు తీస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. దీనిపై ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు?
పాలనాధికారి: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రైతుల నుంచి తరుగు తీసుకుంటే ఆయా మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే కొనుగోళ్లు నిర్వహించాలి. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి. తడిసిన ధాన్యం ఆరబెట్టిన అనంతరం తూకం వేయాలి.


ఈనాడు: భూ సర్వేయర్ల కొరతతో ఇబ్బందులు వస్తున్నాయి. సమస్యలు పరిష్కరించడంలో ఆ శాఖ అధికారులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?
పాలనాధికారి:జిల్లాలో సర్వేయర్ల కొరత ఉంది. ఉన్న సిబ్బందితో రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా భూముల కొలతలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. ఒకటి రెండు రోజుల్లో భూ కొలతల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించి ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులు పరిష్కరించాలని నిర్దేశిస్తా.


ఈనాడు: ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
పాలనాధికారి:అకాల వర్షాలతో సేకరణలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. రైసుమిల్లర్లు సేకరణకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 350 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. 180 కేంద్రాల్లో పూర్తయ్యాయి. బాయిల్డ్‌ మిల్లులకు కేటాయింపులు పెంచాం. తహసీల్దార్లు, సహకార, వ్యవసాయ శాఖ అధికారులతో కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తున్నాం. మరో నాలుగు రోజుల్లో సేకరణ పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం.


ఈనాడు: ధరణి పోర్టల్‌లోని పెండింగ్‌ భూ సమస్యలు ఏ విధంగా పరిష్కరించనున్నారు?

పాలనాధికారి: పెండింగ్‌ భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో డ్రైవ్‌ను నిలిపివేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తిరిగి ప్రారంభిస్తాం. పోర్టల్‌లోని జీఎల్‌ఎం(గ్రీవెన్స్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌)తో పాటు టీఎం-33 మాడ్యూల్స్‌లోని దరఖాస్తులు పరిశీలించే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. జిల్లాలో 2 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తహసీల్దార్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన తర్వాత ఆయా దస్త్రాలను పరిష్కరిస్తాం.


ఈనాడు: మరికొన్ని రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులు పూర్తికాలేదు?

పాలనాధికారి:జిల్లాలో 1,013 పాఠశాలలు ఉండగా.. 994 బడుల్లో పనులు ప్రారంభించాం. 734 పాఠశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. 107 బడుల్లో తుది దశకు చేరుకున్నాయి. పునఃప్రారంభమయ్యేనాటికి పనులు పూర్తి చేయిస్తాం.


ఈనాడు: ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

పాలనాధికారి: ఉపాధ్యాయ బదిలీలతోపాటు పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే మెజారిటీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుంది. స్థానికంగా వర్క్‌ అడ్జెస్ట్‌ ప్రాతిపదికన ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఏర్పాట్లు చేపడతాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని