logo

చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..

నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు.

Published : 21 May 2024 05:22 IST

మరమ్మతులకు నోచుకోని ఖిల్లా జైలు
కూలడానికి సిద్ధంగా ఉన్న రఘునాథాలయ ప్రాంగణం

ఖిల్లా రఘునాథాలయం స్వాగత ద్వారంపై ఏపుగా పెరిగిన చెట్టు

 న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం: నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రాణాలు సైతం త్యాగం చేశారు. రాజకీయ ఖైదీల బొందలగడ్డగా పేరుపొందిన ఖిల్లా జైలు ఎందరో ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. జైలు గది గోడలపై దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ గీతం తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలకు ఊపిరులూదింది. గతమెంతో ఘనకీర్తి ఉన్న ఈ ప్రాంగణాన్ని పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరింది. పర్యాటక కేంద్రంగా మారుస్తామన్న పాలకుల హామీ ప్రతిపాదనలకే పరిమితమైంది. తెలంగాణ తొలి ప్రభుత్వం దాశరథి స్మారక కేంద్రంగా మార్చేందుకు విగ్రహాలను తీసుకొచ్చి జైలుగదిలో ఉంచారు. ఆ తర్వాత ఆలనాపాలనా మరిచారు. దీంతో ప్రారంభించకుండానే అవి పాడవుతున్నాయి. రఘునాథాలయ ప్రాంగణంలో విశాలమైన గది కూలడానికి సిద్ధంగా ఉంది. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వమైనా స్పందించి నాటి ఆనవాళ్లను పరిరక్షించాలని చరిత్రకారులు కోరుతున్నారు. 

  శ్రీరాముడి కల్యాణ ప్రాంగణంలో పైకప్పు పడిపోకుండా కర్రలు అడ్డుపెట్టారిలా..

ఘనమైన గతం ఉన్నా..

53 ఎకరాల సువిశాల ఎత్తైన కొండపై ఖిల్లా జైలు, రఘునాథాలయం ఉన్నాయి. 9వ శతాబ్దంలో మూడో రాష్ట్రకూట చక్రవర్తి ఇంద్రనారాయణుడు ఈ కోటను నిర్మించాడు. చాలా ఏళ్లు సైనిక స్థావరంగా కొనసాగింది. సైనికులకు ఇక్కడే ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారని అంటారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నైజాం కాలంలో జైలుగా మార్చారు. ఎనిమిది బారెక్‌లు ఉన్న జైలులో తెలంగాణ విమోచన కోసం వందల మంది ఉద్యమకారులు ఇక్కడే కఠిన శిక్షలు అనుభవించారు. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు, ప్రముఖ నవలా రచయిత వట్టికోట ఆళ్వార్‌స్వామి జైలు జీవితం గడిపారు. తర్వాతి కాలంలో ఈ జైలును సారంగాపూర్‌కు తరలించారు. దాశరథి శిక్ష అనుభవించిన జైలుగది ప్రస్తుతం శిథిలంగా మారింది. గోడలపై ఉంచిన దాశరథి అరుదైన చిత్రాలు నీటితో తడిసిపోతున్నాయి. జైలుకు కమాన్‌ను రెండు అంతస్తుల్లో పది గదులతో నిర్మించారు. జైలు కొనసాగిన రోజుల్లో ఇక్కడే జైలు అధికారులు పహారా కాసేవారు. ప్రస్తుతం దీనిపై పిచ్చిమొక్కలు పెరిగి చెట్లుగా మారాయి. చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఈ నిర్మాణం ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పర్యాటక శాఖ, పురావస్తు, దేవాదాయశాఖ అధికారులు ప్రాంగణాన్ని సందర్శించారు.రూ.2.50 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేశారు. తర్వాత రూ.5 లక్షలతో దాశరథి కల్చరల్‌ హాలు, అదనపు పనుల కోసం రూ.5 లక్షల నిధులు కేటాయించారు. తర్వాత మరిచిపోయారు.   


పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి

- కందకుర్తి యాదవరావు, చరిత్ర పరిశోధకుడు

ఎంతో ఘనచరిత్ర ఉన్న ఖిల్లా రఘునాథాలయం, జైలు ప్రాంగణాన్ని కాపాడాలి. విలువైన ఇక్కడి భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలి. పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. కింద నుంచి జైలు వరకు రోప్‌వే ఏర్పాటు చేయాలి. దాశరథి, పోలీసుల ప్రతిమలు ఏర్పాటు చేయాలి. స్వాగత తోరణానికి మరమ్మతులు చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని