logo

మట్టి.. కనిపెట్టి

ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది.

Published : 21 May 2024 05:27 IST

భూసార పరీక్షలపై సర్కారు సుముఖత
మూడేళ్ల తర్వాత తెరపైకి..

నిజామాబాద్‌లోని భూసార పరీక్ష కేంద్రంలో నమూనాలు 

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం: ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది. మండల వ్యవసాయశాఖ సిబ్బంది గ్రామాల్లోకి వచ్చి ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో నుంచి మట్టి తీసుకెళ్లేవారు. పరీక్షలు చేసి పత్రాలిచ్చి చేతులు దులుపుకొనే వారు కొందరుంటే ఆసక్తి ఉన్న రైతుల అభిరుచి మేరకు ఫలితాలను బట్టి ఏ పంటకు ఎంత ఎరువు వేయాలో చెప్పేవాళ్లు మరికొందరు. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ భూసార పరీక్షలు చేసేందుకు సర్కారు ముందుకొచ్చింది. వీలైనంత త్వరగా ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయించారు.  

  • ఏ నేలలో ఎంత సారం ఉందో తెలిస్తే అందులో ఉన్న పోషకాల ఆధారంగానే ఏ మోతాదు మేరకు ఎరువులు వేయాలి? ఏ పంట వేస్తే అనుకూలిస్తుందో తెలుస్తుంది. కానీ, మూడేళ్లుగా సర్కారు భూసార పరీక్షల ఊసేత్తలేదు. ప్రత్యేక పరీక్ష కేంద్రాలున్నప్పటికీ వాటి ఉనికి లేకుండాపోయింది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కారు తిరిగి భూసార పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై ఇటీవల స్పష్టత ఇవ్వడంతో మట్టి పరీక్షలు చేసుకునే అవకాశం మళ్లీ వచ్చింది.

లక్ష్యాలు పెట్టి.. లక్షణంగా వదిలేసి

కేంద్రం ప్రతి బడ్జెట్‌లో రైతు పెట్టుబడి తగ్గాలంటే నేలకు అనుగుణంగా పంటలేయాలని పదే పదే ప్రస్తావించేది. అందుకు తగ్గట్లు నిధులు కేటాయించేది. పదేళ్ల కిందట భాజపా సర్కారు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకెళ్లింది. ప్రతి మనిషికి ఆరోగ్య పరీక్ష మాదిరే మట్టి నమూనాలు రైతులకు ఆరోగ్యకార్డుల రూపంలో తెలపాలని లక్ష్యాలు నిర్దేశించింది. ఉమ్మడి జిల్లాలో ఏటా పాతిక వేల నమూనాలు సేకరించి అందించేవారు. వాటి వివరాలను రైతుల చరవాణులకు చేరవేసేవారు. అందులో భాగంగా నిజామాబాద్, బోధన్‌ పరీక్ష కేంద్రాల ద్వారా కార్డులు పంపిణీ చేసేవారు. ఏటా మే-జూన్‌లో రైతు చైతన్య యాత్రల పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారు. 2018-19 తర్వాత అంతగా దృష్టి పెట్టలేదు. 2020-21 తర్వాత మార్కెటింగ్‌ శాఖ ద్వారా జిల్లాలో ఏటా 2,400 మట్టి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి మండలంలో ఓ గ్రామం చొప్పున ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి నమూనాలు సేకరించారు. ఆ తర్వాత ఇప్పుడే దీన్ని తెరపైకి తెచ్చారు. 

ఇదే అదను..

మేలో నేలలన్నీ ఖాళీగానే ఉంటాయి. కొన్ని చోట్ల పొడి, లోదుక్కులు చేసుకుని వానాకాలం పంటకు సిద్ధంగా ఉంటారు. ఈ సమయంలో నమూనాలు సేకరించి ఇస్తే జూన్‌ రెండో వారానికల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వరకు నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఒకటి, బోధన్‌లో మరో పరీక్ష కేంద్రం ఉండేది. ప్రస్తుతం నిజామాబాద్‌లోని మిర్చికాంపౌండ్‌ పరిసరాల్లో ఇందుకోసం ప్రత్యేక భవనం కేటాయించి, ఐదుగురు సిబ్బందిని నియమించారు. జిల్లాలో 108 క్లస్టర్లలో రైతువేదికలు, విస్తీర్ణాధికారులు ఉన్నారు. వీరి పర్యవేక్షణలో మళ్లీ మట్టి నమూనాల సేకరణకు అవకాశం ఏర్పడుతుంది. స్థానికంగా ఉన్న సిబ్బంది సాయంతో ఏ గ్రామంలో ఏ నేలలున్నాయి? ఎలాంటి పంటలేస్తే బాగుంటుంది? నేల సారం ఎలా ఉంది? ఏ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలనే దానిపై అవగాహన కల్పిస్తే సత్ఫలితాలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. 


ఆసక్తి ఉన్న రైతులు ముందుకురావొచ్చు

.. వాజీద్‌హుస్సేన్, జిల్లా వ్యవసాయాధికారి

భూసార పరీక్షలు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న రైతులు ముందుకురావొచ్చు. వ్యవసాయశాఖ సిబ్బంది సాయంతో పంట క్షేత్రాల్లో మట్టి నమూనాలు సేకరించి తీసుకొస్తే వెంటనే ఫలితాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం ప్రత్యేక ప్రయోగశాల, సరిపడా సిబ్బంది ఉన్నారు. నేలలో పోషక విలువల ఆధారంగా ఎరువులు వాడితే పెట్టుబడి తగ్గుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని