logo

పసుపు పంటకు జై

తొలకరి రాగానే జూన్‌ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Published : 21 May 2024 05:30 IST

ఈ సీజన్‌లో 20 శాతం అదనపు సాగు
దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు

పసుపు విత్తుకునేందుకు సిద్ధం చేసిన నేల 

ఈనాడు, నిజామాబాద్, న్యూస్‌టుడే, ఆర్మూర్‌ గ్రామీణం: తొలకరి రాగానే జూన్‌ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఐదేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గుతూ రాగా.. ఈ సారి మాత్రం ఈ పంట వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో గిట్టుబాటు ధర దక్కక సాగుకు దూరమైన వారు తిరిగి వేసేందుకు ఆలోచన చేస్తున్నారు. 9 నెలలు పండించి, ఉడకబెట్టి, ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకెళ్తే.. అక్కడ ధర దక్కక రైతులు విసుగు చెందారు. కానీ, ఈ సీజన్‌లో అనూహ్యంగా రికార్డు స్థాయి ధరలు నమోదవడంతో సాగుదారుల్లో ఆశలు పెంచింది. దీంతో కొత్త రైతులు సైతం నాటేందుకు ముందుకొస్తున్నారు. వీరంతా విత్తనం సేకరించే పనిలో ఉన్నారు. 

ఐదేళ్ల తర్వాత మార్పు

గడిచిన నాలుగైదు ఏళ్లలో 35-40 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. గతంలో 35 - 40 వేల ఎకరాల్లో సాగయ్యేది. గత సీజన్‌లో 23 వేల ఎకరాలకు పడిపోయింది. సాగు వ్యయం పెరుగుతుండటం, ధర క్వింటాకు  రూ.5 వేల నుంచి రూ.6500 మధ్యలోనే ఉండటం రైతులను నిరాశకు గురిచేసింది. కొవిడ్‌ తర్వాత అంతర్జాతీయంగా పసుపు వినియోగం పెరిగినా.. డిమాండ్‌ రాకపోవడంపై చర్చ సాగింది. ఈ క్రమంలోనే దిగుమతులపై నియంత్రణ చర్యలు మొదలయ్యాయి. దీంతో ఎగుమతులకు అవకాశం ఏర్పడింది. దీంతో గడిచిన ఏడాది కాలంగా ధరలో కదలిక వచ్చింది. ఈ సీజన్‌లో మరింత పుంజుకొని సరాసరి రూ.13 వేల నుంచి రూ.14 వేల మధ్య ధరలు దక్కాయి. కొమ్ముకే కాదు..మండకు కూడా డిమాండ్‌ ఏర్పడటంతో రైతులను ఇటువైపు మొగ్గుచూపేలా చేస్తోందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది 20 శాతం మేర సాగు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

విత్తనానికి డిమాండ్‌

ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌కు చెందిన సుమారు 30 మంది రైతులు నందిపేట్‌ మండలంలో ఎక్కువగా సాగు చేస్తున్న రైతుల నుంచి విత్తన పసుపు సేకరించారు. ఒక్కో ట్రాలీ ట్రాక్టర్‌ విత్తనం రూ.60 వేలకు కొనుగోలు చేశారు. ఇది రెండు ఎకరాలకు సరిపోతుంది. ఎకరం విస్తీర్ణంలో సాగు చేసేందుకు సుమారు 8- 10 క్వింటాళ్ల కొమ్ములు అవసరం. 10 క్వింటాళ్లకు రూ.30 వేలు వెచ్చించి విత్తనం కొంటున్నట్లు రైతులు చెప్పారు. ఏటా ఎకరం పండించే రైతు అదనంగా మరో రెండెకరాలు సిద్ధం చేసున్నట్లు అంకాపూర్‌కు చెందిన రైతు వెంకట్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం నూర్పిడి సమయంలోనే మేలైన విత్తనం సేకరించి పెట్టుకున్నట్లు వివరించారు. ఆర్మూర్‌ మండలం మగ్గిడికి చెందిన రైతు గంగాసాగర్‌ రెండేళ్లుగా సాగు ఆపేశారు. పంటకు డిమాండ్‌ ఏర్పడటంతో ఈ సారి మళ్లీ సాగు చేయాలని నిర్ణయించారు. తన గ్రామంలో తెలిసిన రైతు నుంచి రూ.30 వేలు చెల్లించి 10 క్వింటాళ్ల విత్తనం సేకరించారు.


ధర దక్కేలా చర్యలు అవసరం

- చిన్నారెడ్డి, రైతు, మగ్గిడి

ఏటా 4 నుంచి 5 ఎకరాల్లో సాగు చేస్తుంటాను. గడిచిన నాలుగైదు ఏళ్లుగా మంచి రకాలు పండించినా ధర దక్కలేదు. ఈ క్రమంలో రైతులు నిరాశ చెంది సాగు విస్తీర్ణం తగ్గిస్తూ వచ్చారు. ఈ సీజన్‌లో మంచి ధరలు దక్కాయి. ఈ ఏడాది మరో రెండు ఎకరాలు అదనంగా సాగు చేయాలనే ఆలోచన చేశాను. దుక్కిలు సిద్ధం చేసుకున్నాను. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన సైతం రైతుల్లో ఆసక్తికి కారణం. సాగు విస్తీర్ణం పెరిగిందని రానున్న రోజుల్లో ధర తగ్గకుండా.. దళారులు దగా చేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.


అదనంగా రెండెకరాలు వేస్తున్నా

- చరణ్‌రెడ్డి, అర్గుల్, జక్రాన్‌పల్లి

ఆరెకరాల్లో వేస్తుంటాం. కొంతకాలంగా పెట్టుబడులు ఎక్కువవుతున్నా ధర మాత్రం పెరగలేదు. దీంతో మా ప్రాంత రైతులు సాగుకు దూరమయ్యారు. అనూహ్యంగా ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉంది. పరిస్థితి చూసి మరికొందరు పసుపు వేయటానికి ముందుకొస్తున్నారు. నేను కూడా మరో రెండు ఎకరాలు అదనంగా వేయాలని నిర్ణయించుకున్నా. కొత్త రైతులు సైతం విత్తనం అడుగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని