logo

అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిబంధనలు తుంగలో తొక్కి అమ్యామ్యాలకు అలవాటుపడి నాన్‌లేఅవుట్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసిన యంత్రాంగంపై కొరడా ఝుళిపించనుంది.

Updated : 23 May 2024 06:18 IST

కామారెడ్డి, బాన్సువాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వివరాల సేకరణ

ఈనాడు, కామారెడ్డి: సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిబంధనలు తుంగలో తొక్కి అమ్యామ్యాలకు అలవాటుపడి నాన్‌లేఅవుట్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసిన యంత్రాంగంపై కొరడా ఝుళిపించనుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం అక్రమ రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ విభాగం అధికారులు గత రెండు రోజుల నుంచి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని రికార్డులతో పాటు ఆన్‌లైన్‌ దస్త్రాలను పరిశీలిస్తున్నారు. కామారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వీఎల్‌టీ పేరిట జరుగుతున్న అక్రమ వసూళ్లపై సైతం వివరాలు సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు విజిలెన్స్‌ను తప్పించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టారు.


అఫిడవిట్‌లు తీసుకొని..

నిబంధనల ప్రకారం బల్దియా నుంచి వీఎల్‌టీ రుసుం చెల్లించినట్లు ధ్రువపత్రాన్ని సమర్పించిన తర్వాతే ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా కామారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బంది, అధికారులతో కుమ్మక్కయిన లేఖరులు వినియోగదారుల నుంచి ప్రత్యేకంగా అఫిడవిట్‌లు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. అఫిడవిట్‌ల జారీకి భారీగా వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గతంలో వీఎల్‌టీ దందాపై పలువురు బల్దియా అధికారులతో పాటు రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ అధికారులు పురపాలక శాఖ నుంచి వీఎల్‌టీ ధ్రువపత్రాలు లేకుండా అఫిడవిట్‌ల ఆధారంగా జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరిస్తున్నారు.


నిషేధం ఉన్నా..

జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, ఎల్లారెడ్డి, బిచ్కుందలలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. బాన్సువాడ, కామారెడ్డి పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వం నాన్‌లేఅవుట్‌ ప్లాట్ల క్రయవిక్రయాలతో ఇబ్బందులు వస్తున్నాయనే ఉద్దేశంతో వాటి రిజిస్ట్రేషన్లపై 2020 ఆగస్టులో నిషేధం విధించింది. అక్రమాలకు అలవాటు పడిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల యంత్రాంగం నిషేధం ఉన్నా.. గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేసింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు కొనుగోలుదారులకు ఇంటి నిర్మాణాల సమయంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. 


వెనుక ఉన్నది  ఎవరు?

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని నాన్‌లేఅవుట్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి వెనుక ఉన్న అధికారులు ఎవరు..? ప్రభుత్వ ఆదాయానికి ఎంతమేర గండి పడిందనే దానిపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ అధికారుల విచారణను కార్యాలయ సిబ్బందితో పాటు ఆ శాఖకు చెందిన అధికారులు సైతం గోప్యంగా ఉంచుతున్నారు.


నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు

కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పాటైన తర్వాత పట్టణంతో పాటు శివారు గ్రామాల్లో పెద్దఎత్తున రియల్‌ వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఆయా వెంచర్లను లేఅవుట్‌ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం పురపాలక శాఖ వెల్లడించిన నివేదికలో రాష్ట్రంలోనే కామారెడ్డి బల్దియాలోనే నాన్‌లేఅవుట్‌ వెంచర్లు  139 ఉన్నట్లు నిర్ధారించింది. ప్లాట్ల కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే మాదిరి బాన్సువాడ పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో భారీగా నాన్‌లేఅవుట్‌ వెంచర్లు వెలిశాయి. వాటిలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేపట్టారు. రెండేళ్ల కిందట బాన్సువాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో   ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌ను సరెండర్‌ చేస్తూ ఆదేశాలు  జారీ చేశారు. దీంతో పాటు కామారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక వర్గానికి చెందిన స్థిరాస్తి వ్యాపారుల నాన్‌లేఅవుట్‌ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపిస్తూ మరో వర్గానికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సబ్‌రిజిస్ట్రార్‌ను బదిలీ చేశారు. ఇప్పటికీ కామారెడ్డి, బాన్సువాడలతో పాటు ఎల్లారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నాన్‌లేఅవుట్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని