logo

అనుమతులు ఉండవు.. చర్యలు కరవు

‘‘జిల్లా కేంద్రంలోని ఆరు బడులకు విద్యాశాఖ నుంచి అనుమతి లేదు. ఇందులో ప్రవేశాలు పొంది భవిష్యత్తును పాడుచేసుకోవద్దు.

Published : 28 May 2024 02:02 IST

జిల్లాలో యథేచ్ఛగా ప్రైవేటు బడుల ఏర్పాటు

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం: ‘‘జిల్లా కేంద్రంలోని ఆరు బడులకు విద్యాశాఖ నుంచి అనుమతి లేదు. ఇందులో ప్రవేశాలు పొంది భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. అధికారుల సూచనలు పొందాకే బడుల్లో చేర్పించాలి’’. ఇది తాజాగా అధికారులు విడుదల చేసిన ప్రకటన. కానీ అనుమతులు లేని విద్యాసంస్థలను కట్టడి చేయాల్సిన యంత్రాంగం అందుకు భిన్నంగా చోద్యం చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వచ్చే నెల 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తల్లిదండ్రులు పిల్లలను బడుల్లో చేర్పించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. జిల్లాకేంద్రంలో పదుల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేట్‌ బడులు వెలుస్తున్నాయి. విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే కొన్ని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యాజమాన్యాల ప్రతినిధులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పిల్లల తల్లిదండ్రులను కలుస్తూ తమ బడుల్లో చేర్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అనుమతులు లేని బడులను గుర్తించి చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు భావిస్తున్నారు.

ఫిర్యాదు వస్తేనే హడావుడి

విద్యాసంవత్సరం ప్రారంభంలో తనిఖీలు చేసి అనుమతులు లేని విద్యాలయాలను నియంత్రించాల్సి ఉంది. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థిసంఘాల నాయకులు, ఇతరులు ఫిర్యాదు చేస్తేనే తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ప్రమాణాలకు భిన్నంగా..

జిల్లాలో ప్రాథమిక తరగతుల నిర్వహణతో పాటు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతి తప్పనిసరని 2015లో సర్కారు పేర్కొంది. ప్రైవేటు విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. కానీ బడుల యాజమాన్యాలు విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవడం లేదు. మే నెలలో విద్యాసంస్థలను ఏర్పాటుచేసి ప్రవేశాలు కల్పించి విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం చేస్తూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. విద్యార్థులకు చదువు అర్హత పత్రాలను మరో పాఠశాల నుంచి తెప్పించి ఇస్తున్నారు. 

వివరాలు తెలుసుకొని చేర్పించాలి

బడులకు సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకున్నాకే పిల్లలను అందులో చేర్పించాలి. అనుమతి లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు అధికారులను సంప్రదించాకే బడుల్లో ప్రవేశాలు తీసుకోవడం ఉత్తమం.

- రాజు, డీఈవో, కామారెడ్డి


జిల్లాలో.. : ప్రైవేటు బడులు : 168  అనుమతి లేనివి(సుమారు) : 40  అధికారులు గుర్తించినవి : 10 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు