logo

గిడ్డంగుల నిర్మాణం ఎప్పుడో..?

ధాన్యం నిల్వ చేయడానికి ఏటా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్ల దిగుబడులు పెరుగుతున్నప్పటికీ ధాన్యం నిల్వ చేయడానికి సరిపడినన్ని గిడ్డంగులు అందుబాటులో లేక అధికారులకు ఇబ్బందులు తప్పడంలేదు.

Published : 28 May 2024 02:07 IST

ఉమ్మడి జిల్లాలోని 28 మండలాల్లో వీటి అవసరం

కామారెడ్డి శివారులోని ఓ మిల్లులో స్థలం లేక ఆరుబయట ధాన్యం నిల్వ చేసిన రైస్‌మిల్లర్‌ 
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: ధాన్యం నిల్వ చేయడానికి ఏటా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్ల దిగుబడులు పెరుగుతున్నప్పటికీ ధాన్యం నిల్వ చేయడానికి సరిపడినన్ని గిడ్డంగులు అందుబాటులో లేక అధికారులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో గతేడాది అప్పటి భారాస ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక గిడ్డంగి నిర్మించాలని నిర్ణయించింది. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 56 మండలాలున్నాయి. ఇందులో 28 మండలాల్లో ఇదివరకే గోదాంలు ఉండగా.. మిగిలిన 28 మండలాల్లో నిర్మించాలని భావించారు. ఏడాది గడిచినా పనుల్లో పురోగతి కనిపించలేదు. ఈలోపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్‌ సర్కారు గిడ్డంగుల నిర్మాణాలకు చొరవ చూపితే ధాన్యం నిల్వలకు మార్గం సుగమం అవుతుంది. 

దిగుబడుల్లో వృద్ధి...

ఉమ్మడి జిల్లాలో సాగు విధానం పూర్తిగా మారిపోయింది. పదేళ్ల క్రితం బెల్లం తయారీ అధికంగా ఉండేది. ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచేది. ఆ తర్వాత బెల్లం తయారీ నిలిచిపోయింది. వరి సాగు ఏటా పెరుగుతూ వస్తోంది. రైతులు కూడా ఈ పంటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ జోరుగా సాగు చేస్తున్నారు. క్వింటా ధాన్యానికి రూ.2 వేలకు పైగా మద్దతు ధర ఇవ్వడంతో అన్నదాతలు వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో సీజన్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడులకు అనుకూలంగా గిడ్డంగులు మాత్రం పెరగడం లేదు. ఉమ్మడి జిల్లాలో గిడ్డంగుల అవసరం ఎంతైనా ఉంది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల 25 వేల మెట్రిక్‌ టన్నుల గోదాం నిర్మించినప్పటికీ సరిపోవడం లేదు.

పరోక్ష ప్రభావం..

గిడ్డంగుల కొరత కారణంగా ధాన్యం సేకరణ నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం ఇచ్చే వరకు పరోక్ష ప్రభావం పడుతోంది. కేంద్రం బియ్యం సేకరణ నిలిపివేసినా, వ్యాగన్లు సమయానికి రాకపోయినా ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతోంది. ఎఫ్‌సీఐ గోదాంలో బియ్యం పూర్తిగా నిండి ఉండడంతో మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ బియ్యం తీసుకునే అవకాశం ఉండడం లేదు. ప్రస్తుతం మిల్లులన్నీ బియ్యంతో నిండిపోతున్నాయి. దీంతో అప్పటికే రైతుల నుంచి మిల్లులకు వచ్చిన ధాన్యం ఆరుబయట ఉండిపోతోంది. ఆరుబయట ధాన్యం వర్షాలకు తడిచి మొలకలు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. కొందరు మిల్లర్లు ఇతర భవనాలు అద్దెకు తీసుకుని నిల్వ చేసుకున్నారు. అదే సరిపడా గోదాంలు అందుబాటులో ఉంటే ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకున్నా మిల్లుల నుంచి సేకరించిన బియ్యాన్ని అందులో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని