logo

జీలుగ.. లేదుగా

నేలలో భూసారం పెంచుకునేందుకు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట వేసుకోవాలనే లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది.

Published : 28 May 2024 02:26 IST

పచ్చిరొట్ట విత్తనాల కొరత 
అదను దాటుతుందని రైతుల ఆవేదన

పంపిణీకి సిద్ధంగా ఉన్న బస్తాలు 
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం: నేలలో భూసారం పెంచుకునేందుకు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట వేసుకోవాలనే లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది. సాగుకు రైతుల నుంచి మంచి స్పందన ఉన్నప్పటికీ సరఫరా చేయడంలో వ్యవసాయశాఖ విఫలమవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు భిన్నంగా జిల్లాలో నెల రోజుల ముందే సాగు కార్యాచరణ ప్రారంభమవుతుంది. బోధన్‌ డివిజన్‌లో ఇప్పటికే నార్లు పోసి పక్షం రోజులవుతోంది. చాలాచోట్ల ఇప్పుడిప్పుడే నారుమడులు సిద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పచ్చిరొట్ట ఎరువులు నెల రోజుల ముందే సమకూర్చాలి. స్థానిక డిమాండ్‌ దృష్ట్యా వారం కిందట వచ్చిన అరకొర విత్తనాలు రైతుల అవసరాలు తీర్చలేకపోయాయి. మిగతా విత్తనాలు ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నారు. 

మరో 5 వేల క్వింటాళ్లు వచ్చినా సరిపోదు

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా వరి ఒక్కటే 4.30 లక్షల ఎకరాల్లో ఉండనుంది. నిస్సారమైన నేలలున్న చోట పచ్చిరొట్ట ఎరువులు వేసేందుకు రైతులు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చౌడు నేలల్లో వీటి అవసరం తప్పనిసరి. వాస్తవానికి వరి నాట్లేసే ముందు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువులేసి కలియదున్నితే నత్రజని (యూరియా) ఎరువుల వినియోగం తగ్గుతుంది. జిల్లాకు కనీసంగా 40 వేల క్వింటాళ్ల విత్తనం అవసరం. అందరు ఆసక్తి చూపరనే భావించి వ్యవసాయశాఖ అత్యవసరంగా 8,500 క్వింటాళ్లకు ప్రతిపాదించింది. కానీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కేవలం 5,235 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసింది. ఇంకా 3,265 క్వింటాళ్లు రావాల్సి ఉంది. సకాలంలో విత్తనం అందుబాటులో ఉంటే మరో 5 వేల క్వింటాళ్లు వచ్చినా సరిపోయే పరిస్థితి లేదు.

అడిగే వారుండరు

పచ్చిరొట్ట విత్తనాల్లో ఎక్కువగా వినియోగించేది జీలుగ. వీటిని విత్తి పెంచి తుంచాలంటే కనీసం 45 రోజులు పడుతుంది. మరో వారంలో జిల్లాకు రుతుపవనాలు రానున్నాయని వాతావరణ శాఖ సూచనతో రైతులు ఇప్పటికే నారు మడులు సిద్ధం చేసుకున్నారు. ఓ పది శాతం నార్లు పోయడం పూర్తయింది. బోధన్, వర్ని, రుద్రూర్, చందూర్‌ మండలాల్లో కొన్నిచోట్ల నార్లు పోసి పది రోజులైపోయింది. కానీ, ఇప్పటివరకు జీలుగ విత్తనాలు సరఫరా పూర్తికాలేదు. ఈ వారం రోజుల్లో అందితేనే విత్తులు చల్లుకునే వీలుంటుంది. లేదంటే అదను దాటిందని రైతులు వాటి జోలికి వెళ్లరు. రాజస్థాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతిపై ఆధారపడాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సరఫరాలో జాప్యం నెలకొని  రైతులు విత్తనాల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది.


వారం, పది రోజుల్లో వస్తాయి
- వాజీద్‌ హుస్సేన్, జిల్లా వ్యవసాయాధికారి

నిస్సారమైన నేలలు కాపాడుకునేందుకు కర్షకుల్లో వచ్చిన చైతన్యంతో డిమాండ్‌ పెరిగింది. సాగుదారులు విత్తనం కోసం అధైర్యపడొద్దు. ఇప్పటివరకు సొసైటీలు, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల ద్వారా 4,270 క్వింటాళ్ల జీలుగ పంపిణీ చేశాం. మరో 3,300 క్వింటాళ్ల్లు రావాల్సి ఉంది. ఇంకా ఎక్కడైన అవసరముంటే ఏవోల ద్వారా సమీక్షిస్తున్నాం. మరో వారం, పది రోజుల్లో విత్తనాలు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు