logo

విద్యుదాఘాతంతో కూలీ మృతి

నేలపై వాలిన విద్యుత్తు తీగలకు కాలు తగిలి షేక్‌ లతీఫ్‌ (29) అనే కూలీ మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం రాయకూర్‌క్యాంపు శివారులో సోమవారం చోటు చేసుకుంది.

Published : 28 May 2024 02:31 IST

రుద్రూర్, న్యూస్‌టుడే : నేలపై వాలిన విద్యుత్తు తీగలకు కాలు తగిలి షేక్‌ లతీఫ్‌ (29) అనే కూలీ మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం రాయకూర్‌క్యాంపు శివారులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయకూర్‌క్యాంపునకు చెందిన షేక్‌ లతీఫ్‌ అనే యువకుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆదివారం సాయంత్రం వీచిన గాలులకు గ్రామ శివారులోని మురళీకృష్ణ అనే వ్యక్తి పొలంలో కరెంట్‌ తీగలు నేలపై పడ్డాయి. సోమవారం లతీఫ్‌ ఉపాధిహామీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ పొలంలోని విద్యుత్తు తీగలు అతనికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ జయేష్‌రెడ్డి, ఎస్సై అప్పారావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి షబ్బీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు అవివాహితుడు. కాగా తీగను సరిచేయకుండా నిర్లక్ష్యం వహించిన విద్యుత్తు అధికారుల కారణంగానే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు