logo

అక్షిత ఉపన్యాస దక్షత

ఆ విద్యార్థిని చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అనారోగ్యంతో సోదరుడూ మృతిచెందాడు. అయినా ఆత్మస్థైర్యంతో చదువుతో పాటు వివిధ విభాగాల్లో రాణిస్తోంది.

Published : 30 Nov 2022 06:31 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో అక్షిత

విద్యార్థిని చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అనారోగ్యంతో సోదరుడూ మృతిచెందాడు. అయినా ఆత్మస్థైర్యంతో చదువుతో పాటు వివిధ విభాగాల్లో రాణిస్తోంది. ఈ నెల 19న పార్లమెంటు ప్రాంగణంలో హిందీలో ఉపన్యసించి ప్రతిభ చాటింది గిరిరాజ్‌ కళాశాల విద్యార్థిని అక్షిత. డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉపన్యాసం, నృత్యం, పాటలు, చదరంగం, వాలీబాల్‌ తదితర క్రీడల్లో సత్తాచాటింది.

ఉపన్యాస పోటీల్లో జాతీయస్థాయికి..

ఈ ఏడాదిలో నెహ్రూ యువకేంద్రం నిజామాబాద్‌ వారు జిల్లాస్థాయిలో హిందీ దివస్‌ సందర్భంగా భాష విశిష్టతపై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో 20 మంది పాల్గొనగా అక్షిత ప్రథమ స్థానంలో నిలిచింది. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంశంపై 29 మంది పాల్గొంటే అందులోనూ మొదటిస్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికైంది. పార్లమెంటు ప్రాంగణంలో మాజీ ప్రధాని ‘ఇందిరాగాంధీ జీవితం’ అనే అంశంపై మాట్లాడి జాతీయ స్థాయిలో పురస్కారం దక్కించుకుంది.

సాధించిన విజయాలు..

* 2020లో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో వర్చువల్‌ విధానంలో జరిగిన పాటల పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం.

* 2020లో ఎన్‌వైకే ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో జరిగిన జిల్లాస్థాయి నృత్య పోటీల్లో ప్రతిభ.

* 2020లో రాష్ట్రస్థాయి యువ కళాకారిణిగా పురస్కారం.

* 2021లో వాలీబాల్‌, చదరంగం పోటీల్లో కళాశాల స్థాయిలో మూడుసార్లు బహుమతులు సొంతం.

* 2022లో ఎన్‌వైకే నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆరుసార్లు బహుమతులు.

* 2022 నవంబరు 19న దిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఉపన్యసించి ప్రత్యేక పురస్కారం అందుకుంది.


సొంతంగా సాధన చేశా
- అక్షిత, నిజామాబాద్‌

నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ రంగాల్లో రాణించాలని ఉండేది. అందుకే సొంతంగా సాధన చేశాను. మా అమ్మ అంగన్‌వాడీ టీచర్‌. ఎప్పుడూ వెన్నుతడతారు. ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా యువజన అధికారి ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మరిచిపోలేను. మరింత సాధన చేసి అంతర్జాతయ స్థాయిలో ఉత్తమ కళాకారిణిగా గుర్తింపు సాధిస్తా. ఐపీఎస్‌ అధికారిణి కావాలనే లక్ష్యం పెట్టుకున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని