logo

ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించాలి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత ఏడాదిన్నర కాలంగా బడ్జెట్‌ ఆమోదం లేకుండా జరిగిన వ్యయాలు, అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘనలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించాలని పాలక మండలి సభ్యులు తీర్మానించారు.

Published : 26 May 2023 05:02 IST

రిజిస్ట్రార్‌గా ఆచార్య యాదగిరి పునర్నియామకం
తెవివి పాలక మండలి భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌లో పాలక మండలి సమావేశానికి హాజరైన విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, సభ్యులు

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత ఏడాదిన్నర కాలంగా బడ్జెట్‌ ఆమోదం లేకుండా జరిగిన వ్యయాలు, అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘనలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించాలని పాలక మండలి సభ్యులు తీర్మానించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండటంతో హైదరాబాద్‌లో గురువారం ఈసీ సమావేశం రెండు దఫాలుగా జరిగింది. మొదట రూసా భవనంలో నవీన్‌ మిత్తల్‌తో సభ్యులు భేటీ అయ్యారు. సాయంత్రం సచివాలయ బ్లాకులో జరిగిన సమావేశానికి వాకాటి కరుణ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్‌, మారయ్యగౌడ్‌, ప్రవీణ్‌, నసీం, రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. రిజిస్ట్రార్‌గా ఆచార్య యాదగిరినే పునర్నియమిస్తున్నట్లు ఈసీ సభ్యులు తీర్మానించారు.

పాలక మండలి సమావేశాల్లో తాము తీసుకుంటున్న తీర్మానాలు అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొందని సభ్యులు గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలిసింది. తొందరపాటు వద్దని, వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారికి విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యా కమిషనర్‌ సర్ది చెప్పినట్లు సమాచారం. ఈసీ సమావేశం మళ్లీ జూన్‌ 3వ తేదీన జరపాలని నిర్ణయించారు.

గత అంశాలపైనే చర్చ

గత నెల 19 తేదీ నుంచి వరుసగా జరిగిన అయిదు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈసీ తీర్మానం లేకుండా రిజిస్ట్రార్ల నియామకం, నిధుల దుర్వినియోగం, సిబ్బంది నియామకంలో, పదోన్నతుల్లో వసూళ్ల ఆరోపణలపై చర్చించారు. పీహెచ్‌డీ పట్టాల జారీలో నిబంధనల ఉల్లంఘనలపై వేసిన కమిటీ విచారణకు ముందడుగు పడని పరిస్థితులు నెలకొన్నాయని, నిధుల దుర్వినియోగంపై ఏసీబీ, విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని గతంలో నిర్ణయించిన తీర్మానాల అమలు అంశాలను సభ్యులు గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని