logo

సీపీ గారూ.. బాల చోదకులను నియంత్రించరూ..!

గతేడాది ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఒక విద్యార్థి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. మోర్తాడ్‌ దగ్గర అదుపు తప్పి చెట్టుకు ఢీకొని మృతి చెందాడు.

Updated : 03 Apr 2024 06:30 IST

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

క్షోభ మిగిల్చిన ఘటనలు

గతేడాది ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఒక విద్యార్థి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. మోర్తాడ్‌ దగ్గర అదుపు తప్పి చెట్టుకు ఢీకొని మృతి చెందాడు.

  • ఈ ఏడాది ఫిబ్రవరి 20న పిట్లం నుంచి ఇంటర్‌ విద్యార్థి తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బాన్సువాడకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లే సమయంలో బాన్సువాడ పట్టణంలోనే బస్సు కింద పడి మృతి చెందగా స్నేహితుడికి గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలు వారి వారి కుటుంబాలకు ఎంత క్షోభను మిగిల్చి ఉంటాయో తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి.


శ్రీయుత గౌరవనీయులైన పోలీసు కమిషనర్‌ గారికి,

సార్‌.. మేము బాల వాహన చోదకుల బాధితులం. గల్లీలు, ప్రధాన రహదారుల్లో బాలలు రయ్యున వాహనాలతో దూసుకొస్తుండటంతో భయభ్రాంతులకు గురవడంతో పాటు ప్రమాదాల బారిన పడుతున్నాం. దీంతో మాలాంటి వారంతా చర్చించుకుని బాల డ్రైవర్ల నియంత్రణకు మీకో అప్పీలు చేద్దామని లేఖ రాస్తున్నాం. నియంత్రణ మీ ఒక్కరి బాధ్యతే అని కాదు. కానీ ఖాకీ యూనిఫాం, చట్టాలు అంటే గౌరవం, గుర్తుకొచ్చే క్రమశిక్షణ.. ఇవన్నీ బాలురను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతుందనే ఆశతో ఉన్నాం. జిల్లాలో ఇంటర్‌, పదో తరగతి విద్యార్థులు దాదాపు 20 వేల వరకు ఉన్నారు. వారిలో ఐదు శాతం మంది వాహనాలు తీసుకుని బయటకు వస్తే వెయ్యి బండ్లు రహదారులపై చక్కర్లు కొడుతున్నట్టు లెక్క.

వయసుకు మించిన వాహనాలు..

ప్రస్తుతం పది, ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో వారు తమ వయసుకు మించిన వాహనాలు నడుపుతున్నారు. అది వారికి ఆనందం కలిగించినా.. ఎదుటి వారి ఆనందాన్ని హరించే పరిస్థితులు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాలే కాదు కార్లు సైతం తోలుతూ రోడ్లపై ప్రజలను హడలెత్తిస్తున్నారు. వారిని ఆపేవారెవరూ?.. బాధ్యత తెలిపేవారు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లేదు. అందుకే తనిఖీలు చేస్తూ, చలానాలు వేస్తూ వాహనదారులకు బాధ్యత గుర్తు చేస్తున్న పోలీసుశాఖనే బాలలను నియంత్రించడానికి సరైందని భావిస్తున్నాం. ఇప్పటికే 7-9వ తరగతి విద్యార్థులు పాఠశాలకు ద్విచక్ర వాహనాలపై వస్తుండటం గమనార్హం. కొన్ని ప్రైవేటు బడులను తనిఖీ చేస్తే పిల్లలు తీసుకొచ్చిన వాహనాలు పదుల సంఖ్యలో పార్కింగ్‌ చేసి కనిపిస్తాయి. విద్యార్థులకు అనుమతి లేకపోవడం, అతివేగం, ఆపై పరిమితికి మించి నలుగురైదుగురు ప్రయాణం, ఇంకా సాహసాలు చేయడం, సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దాలు చేయడం, అర్ధరాత్రి వరకు తిరగడం.. వంటి చర్యలతో మోటారు వాహన నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వద్దని ఎవరు చెప్పినా వారితో వాదన, ఘర్షణకు దిగుతున్నారు. వారి ద్వారా ఎదుటి వాహనదారుడు ప్రమాదానికి గురై మరణిస్తే అతని కుటుంబం పరిస్థితి ఎలా? అనే స్పృహ వారిలో కలిగించేందుకు చట్టం నిర్దేశించిన కాఠిన్యం చూపాలని కోరుతున్నాం.

తల్లిదండ్రులూ.. ఆలోచించాల్సిందే..

తమ పిల్లలు వాహనం నడుపుతున్నారని ఉప్పొంగిపోయే తల్లిదండ్రులు ఆ వాహనం నడపడంపై వారికున్న అవగాహన ఎంత?, మన సమక్షంలో, మనం లేని సమయంలో ఎలా నడిపిస్తున్నాడు? అనే విషయాలు గమనించాలి. వారి వయసుకు పరిమిత విచక్షణ ఉంటుంది. రోడ్డుపై దూసుకెళ్లడం తప్ప ప్రమాదాలకు గురైతే ఏంటి పరిస్థితి? అనే ఆలోచన ఉండదు. వాస్తవానికి పోలీసులు వాహనం నడిపే పిల్లలపై కేసులు పెట్టాలంటే.. లైసెన్సు లేకుండా నడపడం, అతివేగం, శబ్ద కాలుష్యం, నంబరు ప్లేటులో లోపాలు, మత్తు పదార్థాలు దొరికితే.. ఇలా బండి తోలిన వ్యక్తితో పాటు యజమానిపైనా దాదాపు పది రకాల కేసులు నమోదు చేయొచ్చు. అలా చేస్తే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అనే ఉద్దేశంతో పోలీసులు ఉంటే బాలురు వారిని, నియమాలను తేలికగా తీసుకుంటున్నారు. రవాణా శాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తే వాహనదారులకు రూ.25వేల వరకు జరిమానాలు విధించవచ్చట. ఇక మోటారు వాహన చట్టం, పోలీసుశాఖ ఐపీసీ (న్యాయ సంహిత) సెక్షన్ల కింద కేసులవుతాయి. వీటి ఆధారంగా చూస్తే కనీసం మూడు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని పిల్లలకు వాహనాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండండి.

ఇట్లు : బాల వాహన చోదకుల బాధితులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని