logo

బలదేవ్‌జీ ఆశీస్సులు ఎవరికో?

తులసి తీర్థంగా వినుతికెక్కిన కేంద్రపడలో బలదేవ్‌జీ స్వామి ఆశీస్సులు ఈసారి ఎవరికి? అందనున్నాయి? ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు?

Published : 27 May 2024 03:54 IST

కేంద్రపడలో  బైజయంత్, అంశుమన్‌ల ముఖాముఖి పోరు

బైజయంత్‌ పండా, అంశుమన్‌ మహంతి, సిద్ధార్థ్‌ స్వరూప్‌ దాస్‌ 

న్యూస్‌టుడే, భువనేశ్వర్‌: తులసి తీర్థంగా వినుతికెక్కిన కేంద్రపడలో బలదేవ్‌జీ స్వామి ఆశీస్సులు ఈసారి ఎవరికి? అందనున్నాయి? ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు? పార్లమెంటు స్థానంలో ఎవరు విజయం సాధిస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి నవీన్‌ చిన్ననాటి స్నేహితుడు బైజయంత్‌ పండా, బిజు పట్నాయక్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆయనను చెప్పుకునేవారు. బైజయంత్‌ తండ్రి బంశీధర్, బిజుల బాల్య స్నేహితులు వీరిద్దరి బంధం విడదీయలేనిది. అప్పట్లో రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బంశీధర్‌. బిజు మరణానంతరం రాష్ట్రంలో బిజద ఆవిర్భావంలో బైజయంత్‌ కీలకపాత్ర పోషించారు. కాల ప్రవాహంలో సీఎం, బైజయంత్‌లు విడిపోయారు. 2014 ఎన్నికల్లో బిజద అభ్యర్థిగా కేంద్రపడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన బైజయంత్‌ 2019లో భాజపా తరఫున బరిలో దిగి పరాజయం చవిచూశారు. భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షునిగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఈసారి మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. సీటు నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

తులసి తీర్థంలో గట్టిపోరు

కేంద్రపడ బలదేవ్‌జీ క్షేత్రాన్ని తులసి తీర్థంగా భక్తులు అభివర్ణిస్తారు. ఈ ఆధ్యాత్మిక పీఠంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోరుపై రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఉంది. నవీన్‌ పాలనా వైఫల్యాలు ఎండగడుతున్న బైజయంత్‌ సీఎం కంట్లో నలుసుగా మారారు. ఆయనను ఓడించడానికి బిజద నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. నవీన్‌ సన్నిహితుడు వి.కార్తికేయ పాండ్యన్‌ బైజయంత్‌ను ఓడించడానికి వ్యూహరచన చేసి నమ్మకమైన నేతల్ని ప్రచారానికి నియమించారు. పాండ్యన్‌ తరచూ కేంద్రపడ వచ్చి ఓటర్లను కలుస్తున్నారు. మరోవైపు బైజయంత్‌ను గెలిపించుకోవడానికి భాజపా నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆ పార్టీ అగ్రనేతలు కొంతమంది ఇక్కడ మకాం వేశారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 29న కేంద్రపడ వస్తున్నారు.

ఈసారి అంశుమన్‌

బిజదలో లోగడ స్టార్‌ ప్రచారకునిగా నవీన్‌కు వెన్నుదన్నుగా నిలిచిన ఒడియా సినీ హీరో అనుభవ్‌ మహంతి గతసారి కేంద్రపడలో బిజద అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన బిజద వీడి భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నవీన్‌ గూటికొచ్చిన రాజ్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంశుమన్‌ మహంతికి సీఎం కేంద్రపడ బిజద అభ్యర్థి చేశారు. 

కాంగ్రెస్‌ తరఫున సిద్ధార్థ్‌

ఏఐసీసీ నాయకత్వం యువజన కాంగ్రెస్‌ నేత సిద్దార్థ్‌ స్వరూప్‌ దాస్‌ను బరిలోకి దించింది. కేంద్రపడలో హస్తం పెద్దలంతా ఇటీవల బిజద, భాజపాలో చేరిపోయారు. కార్యకర్తల బలం నామమాత్రం కావడంతో యువ, విద్యార్థి నేతల అండదండలతో ప్రచారం చేస్తున్న సిద్ధార్థ్‌కు అర్థబలం తక్కువ. కాంగ్రెస్‌ నాయకత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన ఇబ్బందులు చవిచూస్తున్నట్లు తెలిసింది.

విజయావకాశాలపై ఇద్దరిలో ధీమా

 బైజయంత్‌ రాజకీయ యోధుడు. పారిశ్రామిక వేత్తగా, టీవీ ఛానెల్‌ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. దిల్లీలో పలుకుబడి ఉంది. తొలిసారిగా రంగంలోకి దిగిన బిజద అభ్యర్థి అంశుమన్‌ పోటీ నవీన్‌ ప్రచారం, వ్యూహాలపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న సిద్ధార్థ్‌ కూడా తొలిసారిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల పోరులో ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉన్నారు. విజయావకాశాలపై బైజయంత్, అంశుమన్‌లిద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రపడ లోక్‌సభ పరిధిలో సాలెపూర్, మహంగ, పట్కురా, కేంద్రపడ, ఒళి, రాజ్‌నగర్, మహాకాళ పడ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. జూన్‌ 1న చివరి నాలుగో విడత పోలింగ్‌ ఇక్కడ జరగనుంది. విజ్ఞత కల ఓటర్లు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారన్నది తేలనుంది. జూన్‌ 4న కేంద్రపడ విజేత ఎవరన్నది స్పష్టం కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని