logo

అన్నదాతలను మోసగించిన సీఎం: ప్రదీప్‌

అన్నదాతల ప్రయోజనాలు ధ్యేయమని పునరుద్ఘాటిస్తున్న నవీన్‌ పట్నాయక్‌ 25 ఏళ్ల పాలనలో ఏం మిగిల్చారని, వారి ఆదాయ మార్గాలు మెరగవలేదని భాజపా కృషక్‌ మోర్చా అధ్యక్షుడు ప్రదీప్‌ పురోహిత్‌ విమర్శలు గుప్పించారు.

Published : 28 May 2024 06:05 IST

ప్రదీప్‌ పురోహిత్‌ 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: అన్నదాతల ప్రయోజనాలు ధ్యేయమని పునరుద్ఘాటిస్తున్న నవీన్‌ పట్నాయక్‌ 25 ఏళ్ల పాలనలో ఏం మిగిల్చారని, వారి ఆదాయ మార్గాలు మెరగవలేదని భాజపా కృషక్‌ మోర్చా అధ్యక్షుడు ప్రదీప్‌ పురోహిత్‌ విమర్శలు గుప్పించారు. సోమవారం భువనేశ్వర్‌లోని భాజపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో ప్రారంభించిన కాలియా కార్యక్రమం కింద రైతులకు రూ.10 వేలు చొప్పున ఏటా చెల్లిస్తామన్న సీఎం రూ.6 వేలు ఎందుకు కత్తిరించారని ప్రశ్నించారు. క్వింటాలు ధాన్యానికి రూ.వెయ్యి బోనస్‌ ఇస్తామన్న ఆయన మాట నిలబెట్టుకున్నారా?, మండీల్లో జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. 35 శాతం పంట పొలాలకు నీటిపారుదల అందని పరిస్థితి నెలకొందని, ఎన్నికల ముంగిట్లో నవీన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీంఎం గుమస్తా ఎన్నికల్లో విద్వేషాన్ని ఎగదోస్తున్నారని, పోలింగ్‌ జరిగిన ప్రాంతాల్లో నెలకొంటున్న ఉద్రిక్తతకు బిజద గూండాలు కారణమన్నారు. భాజపా అధికారానికి వస్తుందని, అన్నదాతలకు పెద్దపీట వేస్తుందని, క్వింటాలు ధాన్యానికి మద్దతు ధర రూ.3100లు చెల్లింపు జరుగుతుందని, శీతల గిడ్డంగులు ప్రారంభిస్తామని, రైతులకు మోదీ గ్యారంటీ అమలవుతుందని ప్రదీప్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని