logo

చివరి విడత ప్రచారం ముమ్మరం

మూడు విడతల పోలింగ్‌ ముగిసింది. చివరిదైన నాలుగో విడతకు తెర లేచింది. జూన్‌ 1న కేంద్రపడ, జాజ్‌పూర్, జగత్సింగ్‌పూర్, భద్రక్, బాలేశ్వర్, మయూర్‌భంజ్‌ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది.

Published : 28 May 2024 06:14 IST

రాష్ట్రానికి అగ్రనేతల రాక

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మూడు విడతల పోలింగ్‌ ముగిసింది. చివరిదైన నాలుగో విడతకు తెర లేచింది. జూన్‌ 1న కేంద్రపడ, జాజ్‌పూర్, జగత్సింగ్‌పూర్, భద్రక్, బాలేశ్వర్, మయూర్‌భంజ్‌ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. గురువారంతో ఆయాచోట్ల ప్రచారం ముగియనుండగా, అదృష్టం పరీక్షించుకుంటున్న అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 

ప్రతిష్ఠ కోసం పాకులాట

ఆరోసారి అధికారం చేజిక్కించుకోవాలన్న ధ్యేయంతో ఉన్న బిజద నాయకత్వం మిషన్‌శక్తి మహిళల్ని రంగంలోకి దించింది. ఆ పార్టీ శ్రేణులు ఆయాచోట్ల మకాం వేసి ప్రచారం ముమ్మరం చేశాయి. డబుల్‌ ఇంజిన్‌ పాలన పల్లవి ఆలపిస్తున్న భాజపా నాయకత్వం ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వంలోని నేతలంతా ప్రచారానికి వరుసకడుతున్నారు. మరోవైపు వైభవం కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రతిష్ఠ కోసం పరుగులు తీస్తోంది. పరువు దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.

నాలుగోసారి ప్రధాని రాక

ప్రధాని నరేంద్రమోదీ ఇది వరకు రాష్ట్రంలో మూడు విడతల ప్రచారం చేశారు. 29న మళ్లీ వస్తున్నారు. నాలుగో విడతలో ఆయన బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బరిపద చేరుకొని భాజపా విజయ సంకల్ప ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తరువాత బాలేశ్వర్‌లోని రెమునా, కేంద్రపడల్లో పాల్గొంటారు. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చాంద్‌బలి, కొరై, ఏళికియిలి, విమపడల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

ఖర్గే, రాహుల్‌ పర్యటన

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే 29న రాష్ట్రానికి వస్తున్నారు. బాలేశ్వర్, భద్రక్‌లలో కాంగ్రెస్‌ జన ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురువారం ప్రచారానికి వస్తున్నారు. ఆయన సిములియా, సన్నొమొహతిపూర్‌లో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు.

ఉత్తరకోస్తాలో బిజదకు గట్టి పట్టు

ఉత్తర కోస్తా జిల్లాల్లో బిజదకు గట్టి పట్టుంది. ఆయాచోట్ల శ్రేణులు బలంగా ఉన్నాయి. గతసారి బాలేశ్వర్, మయూర్‌భంజ్‌ సీట్లు భాజపా నిలబెట్టుకోగా బిజద జాజ్‌పూర్, జగత్సింగ్‌పూర్, కేంద్రపడ, భద్రక్‌ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది.

చివరి విడత నిర్ణయాత్మకం

నాలుగో విడత పోలింగ్‌ నిర్ణయాత్మకం కానుంది. ఇంతవరకు జరిగిన మూడు దశల్లో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని బిజద, భాజపాలు చెప్పుకుంటున్నాయి. నాలుగో విడతలో ఆధిక్యత సాధించే పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న అగ్రనేతలు చివరి విడత ప్రచారంపై దృష్టి సారించాయి. ఆయాచోట్ల అభ్యర్థులూ పాదయాత్రలు, రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విన్నవిస్తున్నారు. దీంతో ఉత్తరకోస్తాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని