logo

రాష్ట్ర యువతకు కన్నీరు మిగిల్చిన నవీన్‌

నవీన్‌ పట్నాయక్‌ తన 25 ఏళ్ల పాలనలో రాష్ట్ర యువతకు కన్నీరు మిగిల్చారని, ఇక్కడ ఉపాధి లేకపోవడంతో వేలాదిమంది గుజరాత్‌కు వలసపోవడం అత్యంత దురదృష్టకరమని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ అన్నారు.

Published : 28 May 2024 06:17 IST

అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ

పట్కురా సభలో విశ్వశర్మకు గజమాలతో సత్కారం 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: నవీన్‌ పట్నాయక్‌ తన 25 ఏళ్ల పాలనలో రాష్ట్ర యువతకు కన్నీరు మిగిల్చారని, ఇక్కడ ఉపాధి లేకపోవడంతో వేలాదిమంది గుజరాత్‌కు వలసపోవడం అత్యంత దురదృష్టకరమని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ అన్నారు. సోమవారం సాయంత్రం పట్కురా కేంద్రపడ, భద్రక్, జాజ్‌పూర్, కాకట్‌పూర్‌లలో ఏర్పాటైన భాజపా ఎన్నికల బహిరంగ సభల్లో ప్రసంగించిన విశ్వశర్మ నవీన్‌ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. లక్ష ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నా, సీఎం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. అసోంలో తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే లక్ష ప్రభుత్వోద్యోగాలకు రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించి ఒకేరోజు జాయినింగ్‌ ఆర్డర్లు ఇచ్చిన సంగతి ప్రస్తావించారు. అసోం వార్షిక బడ్జెట్‌ రూ.లక్షన్నర కోట్లు కాగా, ఒడిశాలో ఇది రూ.రెండున్నర లక్షల కోట్లుగా ఉన్నా ప్రజలకు మౌలిక సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం శోచనీయమన్నారు. దేశంలో ఎక్కువ సంపద గల రాష్ట్రం ఒడిశా అని, ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకపోవడం, సంపద దుర్వినియోగం కావడం నవీన్‌ వైఫల్యం కాదా? అంటూ ప్రశ్నించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న సీఎం పాలనను పాండ్యన్‌కు అప్పగించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాల మాదిరిగా చేయడం తగునా? అంటూ విశ్వశర్మ నిలదీశారు. 5-టీ పల్లవి ఆలపిస్తున్న పాండ్యన్‌ ‘టీ’ (తమిళనాడు)కి మాత్రమే ప్రాధాన్యమిచ్చారని, సీఎంను ఆటబొమ్మగా చేసి వ్యవస్థలను ధ్వంసం చేశారన్నారు. ఒడిశాలో 5-టీ లేదని, పాలనంతా పాండ్యన్, ఆయన భార్య చేతుల్లో ఉందన్నారు. హెలికాప్టరులో, సీఎం గదిలో, సభా వేదికలపై నవీన్‌కు వెన్నంటి ఉన్న పాండ్యన్‌ నవీన్‌ ప్రసంగిస్తున్నపుడు మైకు పట్టుకోవడం ఈ రాష్ట్ర దుస్థితికి నిలువుటద్దమన్నారు. ప్రజలు మార్పునకు శ్రీకారం చుట్టి ఈసారి భాజపాను గెలిపించి డబుల్‌ ఇంజిన్‌ పాలనకు తెరలేపాలన్నారు. మోదీ గ్యారంటీ ఒడిశాకు అండగా నిలుస్తుందని, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష మందికి ఉద్యోగాలు తథ్యమని, ఎన్‌హెచ్‌జీ తల్లులందరి బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున జమవుతాయన్నారు. సుభద్ర కార్యక్రమం కింద ప్రతి మహిళకు రూ.58 వేల నగదు చెల్లింపులు వోచర్లు పంపిణీ చేస్తారని, అన్నదాతలకు న్యాయం జరుగుతుందని వివరించారు. బహిరంగ సభలో కేంద్రపడ భాజపా లోక్‌సభ అభ్యర్థి బైజయంత్‌ పండా, ఇతర అసెంబ్లీ అభ్యర్థులు పాల్గొన్నారు. భాజపా నేతలు విశ్వశర్మకు వేదికపై గజమాలతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు