logo

కోస్తాలో కీలకం... ఎవరికయ్యేనో సొంతం?

రాష్ట్రంలో 2019 ఎన్నికల ముందు తహసీల్దారుగా విధులు నిర్వహించిన శర్మిష్ఠ శెఠి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

Published : 28 May 2024 06:30 IST

జాజ్‌పూర్‌లో శర్మిష్ఠ, రవీంద్ర ముఖాముఖి పోరు

శర్మిష్ఠశెఠి

 అభ్యర్థులను మార్చిన భాజపా, కాంగ్రెస్‌

రాష్ట్రంలో 2019 ఎన్నికల ముందు తహసీల్దారుగా విధులు నిర్వహించిన శర్మిష్ఠ శెఠి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విధేయురాలిగా ముద్రపడిన ఆమెను బిజదలో చేర్చుకున్న సీఎం జాజ్‌పూర్‌ అభ్యర్థిగా పోటీకి నిలిపారు. అప్పట్లో ఆమె విజయం సాధించారు. మళ్లీ ఆమెకు ఈసారి అవకాశమిచ్చారు. భాజపా 2019 అమయకాంత మల్లిక్‌ను, కాంగ్రెస్‌ మానస్‌దాస్‌లను బరిలోకి దించాయి. ఈసారి భాజపా నాయకత్వం ఆరెస్సెస్‌ ప్రచారకుడు, సామాజిక కార్యకర్త రవీంద్రనారాయణ బెహరాను రంగంలో నిలిపింది. పుర్వాశ్రమంలో ఉన్నతోద్యోగి అయిన రవీంద్రకు జాజ్‌పూర్‌లో పలుకుబడి ఉంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంచల్‌ దాస్‌కు ఏఐసీసీ నాయకత్వం అవకాశమిచ్చింది. ఆయనకు అర్థబలం ఉన్నా అనుచరులు తక్కువ. 

రవీంద్రనారాయణ బెహరా                      అంచల్‌ దాస్‌ 


శర్మిష్ఠపై వ్యతిరేకత

సిటింగ్‌ ఎంపీ శర్మిష్ఠ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. గడిచిన అయిదేళ్లలో ఆమె స్వీయ ప్రయోజనాలకే పరిమితమయ్యారని, జాజ్‌పూర్‌కు చేసిందేమీ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దిల్లీ, భువనేశ్వర్‌లకు పరిమితమైన శర్మిష్ఠ ప్రజలకు దూరమయ్యారు. భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న రవీంద్ర అధికారంలో లేకపోయినా ప్రజలకు చేరువగా వివిధ కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటున్నారు. యువకుని మాదిరిగా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన అంచల్‌కు వయసు పైబడింది. ఉత్సాహంగా తిరిగే పరిస్థితి లేదు. పార్టీలో కాస్తోకూస్తో ఆదరణ ఉన్న నేతలు బిజద, భాజపాల్లో చేరిపోయారు. కార్యకర్తలు నామమాత్రం కావడంతో ప్రచారం అంతంతమాత్రంగా ఉంది.


ప్రచారంలో బిజద, భాజపా ముందంజ

ప్రస్తుతం ప్రచారంలో బిజద, భాజపా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కేంద్ర మంత్రులు తరచూ జాజ్‌పూర్‌ వస్తున్నారు. త్రిపుర మాజీ సీఎం, సిటింగ్‌ ఎంపీ బిప్లవ్‌దేవ్‌ ఇక్కడ మకాం వేసి రవీంద్రకు అండగా ఉంటూ ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి నవీన్, ఆయన విధేయుడు వి.కార్తికేయ పాండ్యన్‌లు శర్మిష్ఠ విజయానికి వ్యూహాలు రచిస్తున్నారు. మహిళా సంఘాలు ఆమెకు అండగా ఉన్నాయి. బిజద, భాజపాలతో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రచారం అంతంతమాత్రంగానే ఉంది. జాజ్‌పూర్‌ జిల్లాకు తరచూ వరదలు చుట్టుముడుతున్నాయి. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న నవీన్‌ ప్రభుత్వం వరదల నుంచి ప్రజలను, ఆస్తులను రక్షించే కార్యక్రమాలు చేపట్టలేదు. ఇదే విషయం ఈసారి ఎన్నికల్లో విపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది. బిరజా అమ్మవారి ఆశీస్సులతో వరదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని భాజపా ఓటర్లకు హామీ ఇస్తోంది.


విజయంపై ధీమా

జాజ్‌పూర్‌ లోక్‌సభ పరిధిలో బింజారపూర్, బొరి, బడచొణా, ధర్మశాల, జాజ్‌పూర్, కొరై, సుకింద అసెంబ్లీ సెగ్మెంటున్నాయి. జూన్‌ 1న ఇక్కడ చివరి నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. ఈసారి ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారన్నదిప్పుడు చర్చనీయాంశంగా ఉంది. విజయంపై బిజద, భాజపా నేతలు ఆశాభావంతో ఉన్నారు.


ఉత్తరకోస్తాలో కీలకమైన జాజ్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది. సిటింగ్‌ ఎంపీ శర్మిష్ఠ శెఠి మరోసారి విజేతగా నిలుస్తారా? ఈ స్థానంలో పాగా వేయాలన్న భాజపా ధ్యేయం నెరవేరనుందా? పూర్వ వైభవం నిలబెట్టుకోవాలన్న కాంగ్రెస్‌కు ఓటర్లు ఆదరిస్తారా? అన్నిదిప్పుడు చర్చనీయాంశమైంది.

- న్యూస్‌టుడే, భువనేశ్వర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని