logo

ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు

గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Published : 25 Apr 2024 04:03 IST

 

 భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన కొడుకులిద్దరు తలో పార్టీలో చేరారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ప్రచారానికి రావద్దని, ఆయన వస్తే ఓడిపోతామని వారిద్దరూ బాహాటంగా ఆయనను తీసి పారేయడం చర్చనీయాంశమైంది.

మహాయోధుడు సురేష్‌

ఖుర్దా జిల్లా జట్నీ ప్రాంతానికి చెందిన సురేష్‌ రౌత్రాయి ఇటీవల 80వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. పార్టీలకతీతంగా నేతలంతా ఆయన నివాసానికొచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలు జీర్ణించుకున్న ఆయన జీవితకాలంలో పార్టీలు మారలేదు. శాసనసభకు అయిదుసార్లు ప్రాతినిధ్యం వహించిన సురేష్‌ మంత్రిగానూ సేవలందించారు. వాస్తవాలను నిర్భయంగా చెబుతారు. నేను ‘పైకా’ వీర వంశానికి చెందినవాణ్నని, తల వంచే పరిస్థితి లేదని చెప్పుకొనే ఆయన సభలోనూ కుండబద్దలు కొట్టేలా మాట్లాడేవారు. అన్ని పార్టీల నాయకులు ఆయనను గౌరవించేవారు. రాజకీయ యోధునిగా మన్ననలందుకున్నారు.

పరిస్థితి మారింది

ఇప్పుడు సురేష్‌ ‘ఏకాకి’ అయ్యారు. వయసు పైబడడంతో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన కుమారులిద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు.  ఏఐసీసీ అధిష్ఠానం ఆయన ప్రతిపాదనకు అంగీకరించింది. ఆయన కోరిన విధంగా పెద్దకుమారుడు సిద్ధార్ద్‌కు పూరీ జిల్లా నిమపడ అసెంబ్లీ సీటు, చిన్నకొడుకు మన్మధకు ఖుర్దా జిల్లా జట్నీ స్థానం కేటాయించడానికి పార్టీ పెద్దలు అంగీకరించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సిద్ధార్ద్‌, పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న మన్మధ ఉద్యోగాలు వదులుకుని రాష్ట్రానికి వచ్చారు. ఇంతవరకు కథ బాగానే ఉన్నా ఆ తర్వాతే సురేష్‌కు రివర్స్‌ అయింది. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని,  తాను బిజదలో చేరుతున్నట్లు చిన్నకుమారుడు తెగేసి చెప్పాడు. ముఖ్యమంత్రి నవీన్‌ సమక్షంలో అధికార పార్టీలో చేరి ఏకంగా భువనేశ్వర్‌ లోక్‌సభ అభ్యర్థిగా టికెట్‌ సాధించాడు.

ఇద్దరూ వద్దన్నారు

కాంగ్రెస్‌ నాయకత్వం సిద్ధార్ద్‌కు నిమపడ అసెంబ్లీ సీటు కేటాయించింది. ఇద్దరు కొడుకులు తలోదారి పట్టిన తర్వాత సురేష్‌ ఒంటరి అయ్యారు. ప్రచారానికి రావద్దని ఆయనకు ఇద్దరు కొడుకులు స్పష్టంగా చెప్పేశారు. ఆయన వస్తే తమకు నష్టమని పేర్కొన్నారు.

  బిజద అంచనాలు తలకిందులు

మన్మధకు లోక్‌సభ సీటు కేటాయిస్తే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు బిజద పరమవుతుందన్న అధినేత అంచనాలు తలకిందులయ్యాయి. మైనార్టీ వర్గానికి యువనేత యాసిర్‌ నవాజ్‌ను కాంగ్రెస్‌ భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానం కేటాయించిన తర్వాత పార్టీ శ్రేణులన్నీ సురేష్‌కు దూరమయ్యాయి. కొడుకు తరఫున కొన్నాళ్లు ప్రచారం చేసినా కార్యకర్తలెవరూ పాల్గొనలేదు. ఈ క్రమంలో ఆయన పెద్దకుమారుని వద్దకు వెళ్లలేకపోతున్నారు.

 బావగారు వస్తే బాగుండు

పీసీసీ ప్రచార సంఘం అధ్యక్షుడు ప్రసాద హరిచనందన్‌ సురేష్‌ రౌత్రాయికి అల్లుడు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ప్రచారానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో నిమపడలో సిద్ధార్థ్‌ విలేకరులతో మాట్లాడుతూ...తండ్రి సురేష్‌ సాయం వద్దన్నానని చెప్పారు. బావగారు హరిచందన్‌ అండగా ఉండాలని కోరుకున్నానని, ఆయన పిపిలిలో రెండు రోజులు ప్రచారంలో పాల్గొనాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఎవరిని ఆదరిస్తారో?

సురేష్‌ జట్నీలో విలేకరులతో మాట్లాడుతూ... ఇద్దరు కొడుకులు తనసాయం వద్దని స్పష్టంగా చెప్పేశారన్నారు. తానిప్పుడు ఏ పార్టీకి చెందిన నేతను కానని, వారు కాదన్నా, తాను మన్మధ తరఫున భవనేశ్వర్‌లో ఒంటరిగా ప్రచారం చేసి ఓటర్లను అభ్యర్థిస్తానన్నారు. సురేష్‌ ఇద్దరు కొడుకులు తలో బాట పట్టిన నేపథ్యంలో ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.

పార్టీకి దూరమైన అగ్రనేత

పుత్ర వాత్సల్యం ముందు పార్టీ సిద్ధాంతాలు వదులుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ మినహా మరో పార్టీ పంచకు వెళ్లనన్న సురేష్‌ మన్మధ్‌ బిజద అభ్యర్థి అయ్యాక, ఆయన పక్షాన ప్రచారం చేశారు. దీంతో అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనను
పార్టీ నుంచి సస్పెండు చేసింది.

 నవీన్‌ ఆదరణ  గెలిపిస్తుంది

దీనిపై మన్మధ భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తనను నవీన్‌ ఆదరణ గెలిపిస్తుందన్నారు. తండ్రి సాయం అవసరం లేదని, అందుకే ప్రచారానికి రావద్దని చెప్పేశానన్నారు. పైలట్‌గా రాణించిన తాను భువనేశ్వర్‌ ఎన్నికల క్రీడలో విజేతగా నిలుస్తానని చెప్పారు. అన్నిచోట్లా తనకు ఓటర్లు ఆశీర్వదిస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని