logo

సర్వజన సంక్షేమం.. రామరాజ్య ఆదర్శం

శ్రీరామచంద్రుడు.. తాను అవతార పురుషుడనని ఎక్కడా చెప్పుకోలేదు. మనిషిగా మానవతా విలువలు, రాజుగా ధర్మపాలన, సంక్షేమ రాజ్యాన్ని అందించాడు. తన గుణగణాలతో,   జనరంజక పాలనతో మానవమాత్రునిగా పుట్టి దేవునిగా కీర్తి పొందాడు.

Updated : 17 Apr 2024 06:18 IST

తరతరాలుగా గుర్తింపు పొందిన ఆదర్శ పాలన

శ్రీరామచంద్రుడు.. తాను అవతార పురుషుడనని ఎక్కడా చెప్పుకోలేదు. మనిషిగా మానవతా విలువలు, రాజుగా ధర్మపాలన, సంక్షేమ రాజ్యాన్ని అందించాడు. తన గుణగణాలతో,   జనరంజక పాలనతో మానవమాత్రునిగా పుట్టి దేవునిగా కీర్తి పొందాడు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా పాలించడమే సంక్షేమ     రాజ్యమని నిరూపించాడు. అందుకే ఆయన    పాలనరీతి నేటికీ ప్రామాణికంగా నిలిచింది. ఇప్పటి పాలకులు తమ ప్రసంగాల్లో మాత్రమే రామరాజ్యాన్ని ప్రస్తావిస్తూ ఆచరణలో రామతత్వానికి, పాలన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.  

- న్యూస్‌టుడే, పార్వతీపురం


నాడు: రాముని రాజ్యం.. సంక్షేమ రాజ్యం

నేడు: సంక్షేమం ముసుగులో దోపిడీ రాజ్యం కొనసాగుతోంది. చేతిలో రూపాయి పెట్టి.. వారి జేబులో పది రూపాయలను నొప్పి తెలియకుండా ప్రభుత్వం నొక్కేస్తోంది. ఆనందానికి తాగుతున్న మద్యపాన ప్రియులు సైతం మత్తు దిగిపోయాక తమ ఆరోగ్య పరిస్థితిని తలచుకొని తల్లడిల్లుతున్నారు. బటన్‌ నొక్కుతున్నామని చెప్పడమే తప్ప ఖాతాల్లో నగదు కనిపించడం లేదు.

నాడు: దొంగతనాలు, దోపిడీ అనే మాటలే తెలియవు

నేడు: ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణే లేదు. పదవుల్లో ఉన్నవారంతా అందినకాడికి దోచుకొనే సంప్రదాయానికి అలవాటు పడ్డారు. భూములు, చెరువులు, బలహీనుల ఆస్తులు కబ్జా చేయడమే నేటి నాయకుల ధ్యేయం. ప్రజాసంపద, ప్రకృతి వనరులను దోచుకున్న వారే ప్రస్తుతం అందలాలను అధిరోహిస్తున్నారు.

నాడు: యువతలో చురుకుదనం, వీరత్వం

నేడు: యువశక్తిని సంపద సృష్టికి ఎలా వినియోగించుకోవాలనే ఆలోచన లేకుండా పోతోంది. ఉద్యోగావకాశాల కోసం యువత ఏళ్లుగా ఎదురుచూస్తూ నిస్తేజమైపోతోంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని రాజకీయ క్రీడలతో దెబ్బతీస్తున్నారు. ఉన్నత విద్యావంతులు సైతం కూలీనాలీ చేస్తూ బతుకులీడ్చాల్సిన దుస్థితి నెలకొంది.

నాడు: కర్తవ్య దీక్ష, బాధ్యతగా ప్రజాసేవ

నేడు: కర్తవ్య దీక్ష అనే పదానికి అర్థం లేకుండా పోయింది. పాలనలో కర్రపెత్తనం చేసే శక్తులు చెప్పింది చేయడమే ఇప్పుడు కర్తవ్య దీక్షగా మారింది. అధికారంలో ఉన్నవారి సంతృప్తి కోసం పని చేయడమే బాధ్యతగా తయారైంది. తప్పు, ఒప్పు అనే విచక్షణ కొందరు అధికారుల్లో కొరవడింది. అడుగులకు మడుగులొత్తడమే నేటి పాలనలో అమలవుతోంది.

నాడు: బాధలు ఉండేవి కాదు..అందరికీ అన్నీ సమకూరేవి

నేడు: పేదలు, బడుగు వర్గాలు అనేక రకాల బాధలతో మగ్గిపోతున్నారు. ఆసుపత్రుల్లో వైద్యం అందడమే గగనంగా మారిపోయింది. ప్రసవానికి వైద్యశాలలో చేరడానికి సైతం నలుగురి సహకారం (డోలీ) ఉండాల్సిందే. నడిమార్గంలో ప్రసవించే సందర్భాలెన్నో ఉన్నాయి. రక్తహీనతతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. పాఠశాలల్లో చదువుతూనే ప్రాణాలు కోల్పోతున్నారు.

నాడు: సస్యశ్యామలం.. ప్రకృతి నిండుదనం

నేడు: పచ్చని చెట్లు.. రంగురంగుల పూలతో కళకళలాడే మొక్కలు మచ్చుకైనా లేకుండా చేస్తున్నారు. నేతలు బయటకు వస్తే పచ్చదనానికి గండం ముంచుకొచ్చే రోజులు దాపురించాయి. కొండలను పిండిచేయడం, ప్రకృతి వనరులను దోచుకోవడం ప్రస్తుత పాలకుల నిత్యకృత్యమైపోయింది. సాగునీటి పథకాలను గాలికొదిలేసి సేద్యాన్ని వరుణుడి కరుణకు వదిలేశారు.

నాడు: ఒకటే మాట.. ఒకటే బాట

నేడు: మడమ తిప్పబోమంటూ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి.. గెలిచాక ముఖం చాటేయడమే ప్రగతి సూచికగా అభివర్ణించుకుంటున్నారు. మద్యనిషేధాన్ని అమలుచేసిన తర్వాత ఓట్లు అడుగుతామన్న పెద్ద మనుషులు సొంత బ్రాండ్లు విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఆర్బీకేలతో రైతుల అవసరాలు తీరుస్తామని చెప్పి, వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి కల్పించారు. పాతపింఛను విధానాన్ని రద్దు చేస్తామని నమ్మించి ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలను మోసగించారు. ప్రజా సేవకులుగా మారుస్తామని నియమించిన వాలంటీర్లను పార్టీ సేవకులుగా మారాలని ఒత్తిడి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని