logo

జగన్‌ వేట.. ఓడిన ఆట

గొప్ప వనరులున్న ప్రాంతం ఉత్తరాంధ్ర అని పదే పదే అభివర్ణించే ముఖ్యమంత్రి జగన్‌.. ఈ ప్రాంత క్రీడాకారుల ఉన్నతిలో కీలక పాత్ర పోషించే రాష్ట్ర ఆదర్శ క్రీడా పాఠశాలను ఎందుకు ఎత్తేశారో చెప్పగలరా..? ఎన్నో ఆశలతో అడుగు పెట్టిన క్రీడాకారులను ఎందుకు తరిమేశారో చెప్పగలరా..

Published : 17 Apr 2024 05:02 IST

 తెదేపా క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తే.. ఈ ప్రభుత్వం మూసేసింది...

పిల్లల కోసం నిర్మించిన భోజనశాల

విశాఖను రాజధానిగా చేసుకుని పాలిస్తా..గొప్ప వనరులున్న ప్రాంతం ఉత్తరాంధ్ర అని పదే పదే అభివర్ణించే ముఖ్యమంత్రి జగన్‌.. ఈ ప్రాంత క్రీడాకారుల ఉన్నతిలో కీలక పాత్ర పోషించే రాష్ట్ర ఆదర్శ క్రీడా పాఠశాలను ఎందుకు ఎత్తేశారో చెప్పగలరా..? ఎన్నో ఆశలతో అడుగు పెట్టిన క్రీడాకారులను ఎందుకు తరిమేశారో చెప్పగలరా..  

 - న్యూస్‌టుడే, విజయనగరం క్రీడలు

 రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ క్రీడా పాఠశాల ఎప్పటి నుంచో కడపలో నడుస్తోంది. రెండోది కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం విజయనగరంలో ఆదర్శ క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4వ తరగతి నుంచి ప్రారంభించి.. నెమ్మదిగా ఇంటర్‌ వరకు ఉన్నతి పెంచాలని అనుకుంది. అందులో భాగంగా 2017-2018లో తొలి విడతగా రూ.20 కోట్లతో సువిశాలమైన 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విజ్జీలో ఏర్పాటుకు స్థలం కేటాయించింది.

కరోనా వంక

కరోనా సమయంలో పిల్లలను ఇంటికి పంపించేశారు. తర్వాత అన్నీ విద్యాసంస్థలు తెరిచినా ఈ పాఠశాలను తెరవలేదు. చదువు మధ్యలో ఆగిపోయిందని, తెరవకపోతే పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని తల్లిదండ్రులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కలిసి కాళ్లు, చేతులు పట్టుకుని వేడుకున్నారు. వారి పరిస్థితి చూసి పాఠశాలను తెరిచినా నిర్వహణ భారమవుతుందని అప్పటి క్రీడా అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. సొంత భవనంలోనే పాఠశాలను నడుపుతున్నారు..?, వసతి కూడా సొంత భవనాల్లోనే కదా కేటాయించారు..? పిల్లలకు, ఉపాధ్యాయుల భోజనాలకు, జీతాలకు, ఇతర ఖర్చులకు ఆ మాత్రం బడ్జెట్‌ కేటాయించలేరా..? ఇలా అర్ధాంతరంగా ఆపేస్తే పిల్లల భవిష్యత్తు ఏమిటని నిలదీశారు. అయినా ప్రభుత్వం మూసేసి పిల్లలను వెనక్కి పంపించేసింది.

విజ్జీ మైదానంలో మొండిగోడల మధ్య రాష్ట్ర ఆదర్శ క్రీడా పాఠశాల భవనం

వెంటనే తరగతులు ప్రారంభం

భవనాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక వసతి భవనం తీసుకుని అందులో తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు విజ్జీలో క్రికెట్‌ గ్రౌండులోని భవనంలో తరగతులు  ప్రారంభించారు. 4, 5 తరగతి పిల్లలకు క్రీడా సాధన, విద్యాబుద్ధులు నేర్పాలని తలచగా.. రాష్ట్రం నలుమూలల నుంచి 40 మంది వచ్చి చేరారు. పాఠశాల నిర్వహణకు రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. 11 మంది ఉద్యోగులను నియమించింది. ముగ్గురు ఉపాధ్యాయులను తీసుకుంది. మరో వైపు క్రీడా పాఠశాలకు సంబంధించిన అన్ని భవనాల నిర్మాణాలకు సుమారు రూ.2 కోట్లు విడుదల చేయగా పనులు కూడా ప్రారంభమయ్యాయి.

శిక్షకులను తరిమేశారు

పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు పొరుగు సేవల విభాగంలో కొంతమంది శిక్షకులను నియమించింది. రాజీవ్‌, విజ్జీ మైదానాల్లో కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి వాకింగ్‌, సైక్లింగ్‌, అథ్లెటిక్స్‌ ట్రాక్‌లతో పాటు ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్‌బాల్‌, బాక్సింగ్‌, యోగా, తైక్వాండో, బ్యాడ్మింటన్‌ కోర్టులను నిర్మించింది. జిల్లాల విభజన పేరుతో శిక్షకులను ఇతర జిల్లాలకు తరిమేశారు. ఇటీవల నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నామని క్రీడాధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపారు.

మధ్యలోనే నిలిపేశారు..

విజ్జీలో తలపెట్టిన క్రీడా పాఠశాల భవన నిర్మాణ పనులైనా కొనసాగించారా..? అంటే అది కూడా మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఆ నిర్మాణం మొండిగోడలు, పిల్లర్లతో దర్శనమిస్తున్నాయి. ఉపాధ్యాయులను మాతృ సంస్థకు, పొరుగు సేవల విభాగంలో తీసుకున్న 11 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని