logo

అగచాట్ల వసతి.. అయిదేళ్లుగా దుర్గతి

 వేదిక ఎక్కితే... ‘నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. నా బీసీలు..’ అని ప్రతి సభలో ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల చదువులకు కొలువైన వసతి గృహాల నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు.

Published : 21 Apr 2024 04:55 IST

 

 వేదిక ఎక్కితే... ‘నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. నా బీసీలు..’ అని ప్రతి సభలో ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల చదువులకు కొలువైన వసతి గృహాల నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో కనీసం మరమ్మతులకు కూడా నోచుకోక అనేక గృహాలు అధ్వానంగా మారాయి. దీంతో అసౌకర్యాల మధ్య విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

గజపతినగరం నియోజకవర్గంలో ఒక ఎస్టీ, ఐదు ఎస్సీ, ఏడు బీసీ వసతి గృహాలు, ఒక ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ ఉంది. ఇందులో 662 మంది విద్యార్థులు 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్నారు. నాలుగు వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు 16 ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 1,530 మంది విద్యార్థులు ఉన్నారు. చాలా వరకు భవనాలు శిథిలావస్థకు చేరాయి. నాలుగు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వసతి గృహాల మరమ్మతులకు నాడు-నేడులో సుమారు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపినా.. నిధులు మంజూరు కాలేదు.

50 మందికి రెండే..

పిరిడిలో మరుగుదొడ్ల దుస్థితి

బొబ్బిలి గ్రామీణం, గుర్ల, న్యూస్‌టుడే: పిరిడి బీసీ బాలుర వసతి గృహం చాలా ఏళ్లుగా అద్దె ఇంటిలో నిర్వహిస్తున్నారు. 50 మంది విద్యార్థులున్నా.. రెండు మరుగుదొడ్లు, రెండు స్నానపు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని వాపోయారు. కలవరాయి, కోమటిపల్లి వసతి గృహాలు కూడా అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. పై మూడు వసతి గృహాలకూ ఒక్కరే సంక్షేమాధికారిగా ఉన్నారు. గుర్ల మండలం కలవచర్ల బీసీ బాలుర వసతి గృహంలో 47 మంది ఉన్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదుల తలుపులు అధ్వానంగా ఉన్నాయి. పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయి.  

తిండీ, నిద్ర ఒకేచోటే..!

బొబ్బిలి, న్యూస్‌టుడే: పట్టణ ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని కళాశాల వసతి గృహంలో అరకొర సౌకర్యాల మధ్య బాలికలు అవస్థలు పడుతున్నారు. సుమారు 70 మంది ఉండగా సరిపడా వసతి లేదు. తిండీ, నిద్ర ఒకే చోట సాగిస్తున్నారు. వర్షాకాలంలో స్లాబు నుంచి నీరు కారుతోందని విద్యార్థులు చెబుతున్నారు. నాడు-నేడులో మరమ్మతులు చేపడతామని అధికారులు చెప్పుకొచ్చినా ఇంతవరకు పనులు జరగలేదు. మరుగుదొడ్లు కూడా అరకొరగా నాలుగే ఉన్నాయి. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని సంక్షేమాధికారిణి భాగ్యం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

అపరిశుభ్రం..అస్తవ్యస్తం

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: దత్తిరాజేరు బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు మూలకు చేరాయి. తలుపులు విరిగి, పనికిరాకుండా పోగా.. నీరు సరఫరా కావడం లేదు. విద్యార్థులు అత్యవసరానికి ఆరు బయటికి వెళ్తున్నారు. ప్రస్తుతం మరుగుదొడ్లు అపారిశుభ్రంగా వాడేందుకు వీలులేకుండా ఉన్నాయి. 30 మంది విద్యార్థులున్నారు. ఏళ్లుగా తలుపులు అలాగే ఉన్నాయని సంక్షేమాధికారి లక్ష్మణరావు అన్నారు. మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తామని చెప్పారు.

మరమ్మతులు కరవు

తుప్పుపట్టి మూలకు చేరిన మంచాలు

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: బోనంగి వసతి గృహంలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్న మూడు గదుల్లో ఒక్కటి శిథిలావస్థకు చేరి వర్షపునీరు కారడంతో పాడైంది. అందులో ఉంచిన మంచాలు తడిసి, తుప్పుపట్టాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులు చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. వసతి గృహం చుట్టూ తుప్పలు పేరుకుపోవడంతో విష    సర్పాల భయం వెంటాడుతోంది. స్లాబ్‌ పాడై, నీరు కారడం తదితర సమస్యలను పరిష్కరిస్తామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వసతిగృహం అధికారి చంద్రునాయుడు అన్నారు.

  శిథిలావస్థలో మరుగుదొడ్లు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లిలోని ఎస్సీ బాలుర కళాశాల వసతి    గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వసతిగృహానికి సొంత భవనం లేకపోవడంతో కొత్త గవిడివీధిలో ఖాళీగా ఉన్న పాత వసతిగృహ సముదాయంలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడున్న మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి. మరమ్మతులు చేసినా ప్రయోజనం లేని స్థితికి చేరుకున్నా అధికారులకు పట్టడం లేదు.

నేలపైనే నిద్ర

తెర్లాం, న్యూస్‌టుడే: తెర్లాం ఎస్సీ బాలుర వసతి గృహంలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం హాస్టల్‌లో ఉన్న వారు కింద నేలపైనే నిద్రిస్తున్నారు. కిటికీలు బాగోలేకపోవడంతో సంక్షేమాధికారి తన సొంత నిధులు వెచ్చించి ఇనుప మెష్‌లను అమర్చారు. సరిపడా మరుగుదొడ్ల లేవు. వర్షం కురిస్తే రెండు గదులతోపాటు కార్యాలయం గది కూడా లీకవుతోంది. పైభాగం పెచ్చులూడుతున్నాయి. సమస్యలు అధికారులకు విన్నవించినట్లు సంక్షేమాధికారి అప్పన్న అన్నారు.

నీరు మోయాల్సిందే

బాడంగి, బొండపల్లి, న్యూస్‌టుడే: బాడంగి బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో స్నానపు గదులకు తలుపులు లేవు. నీళ్ల సరఫరాకు పైపులైన్లు ఏర్పాటు చేయలేదు. బకెట్లతో మోయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. నిద్రపోయే గదులు శుభ్రంగా లేవని, దు ధూళితో నిండి ఉన్నాయన్నారు. బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలోని బీసీ బాలికల వసతి గృహంలో 15 మంది ఉన్నారు. సరైన వసతులు లేక విద్యార్థులు చేరడానికి ఇష్టపడటం లేదు. ఇక్కడ మరుగుదొడ్ల తలుపులు విరిగి, పాడైపోయాయి. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు చేరడం లేదని సంక్షేమాధికారిణి పద్మిని అన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని