logo

జగన్‌ మెగా మోసం

మెగా డీఎస్సీతో వేల పోస్టులను భర్తీ చేస్తానని ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అభ్యర్థులను నమ్మించి, ఆశలు చూపిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లపాటు వారికి ఎదురుచూపులే మిగిల్చారు

Published : 21 Apr 2024 05:00 IST

బొబ్బిలి శాఖ గ్రంథాలయంలో డీఎస్సీ సాధనలో నిరుద్యోగులు
బొబ్బిలి, తెర్లాం, దత్తిరాజేరు, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీతో వేల పోస్టులను భర్తీ చేస్తానని ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అభ్యర్థులను నమ్మించి, ఆశలు చూపిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లపాటు వారికి ఎదురుచూపులే మిగిల్చారు. దీంతో ఏళ్లుగా ఎంతో మంది నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లలో, సాధనలో మగ్గిపోతున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు చేరుకుని అద్దెకు ఇళ్లను తీసుకుని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో సుమారు 2,000 మంది విద్యార్థులు డీఎస్సీ శిక్షణ తీసుకుంటున్నట్లు విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు. అప్పులు చేసి చదువుతున్నామని, వడ్డీలు ఎలా కట్టాలో తెలియని స్థితిలో ఉన్నామని వారంతా వాపోతున్నారు.

2019 నుంచి..

 పనుకువలస నుంచి రోజూ బొబ్బిలిలోని కోచింగు సెంటర్‌కు వస్తున్నాను. గంట సేపు శిక్షణ తీసుకున్నాక శాఖా గ్రంథాలయానికి చేరుకుని పుస్తకాలు చదువుతున్నా. 2019 నుంచి డీఎస్సీ కోసం సాధన చేస్తున్నా. ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాం. ఇటీవల డీఎస్సీ ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఈ ప్రక్రియ ముందుకు వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తోంది.

 - ఎం.కిరణ్‌కుమార్‌, పనుకువలస, బొబ్బిలి


   ఎన్నోసార్లు కోచింగ్‌ తీసుకున్నా

నా వయస్సు 43 ఏళ్లు. చాలా పేద కుటుంబానికి చెందిన నిరుద్యోగిని. వయసు మీరిపోవడంతో డీఎస్సీ పోస్టు సాధించగలనా? లేదా? అని తీవ్ర ఆందోళన చెందాను. ఎన్నోసార్లు కోచింగు తీసుకున్నాను. నోటిఫికేషన్‌ రాకపోవడంతో కోచింగ్‌ అయిన ప్రతిసారీ నిరాశతో ఇంటికి వెళ్లిపోయేవాడిని. ఫీజులు చెల్లించలేక అవస్థలు పడ్డాను. నా తండ్రి కూలి డబ్బులతో, స్నేహితుల సాయంతో నెట్టుకొస్తున్నాను. ఒక్కోసారి ఉపాధి పనులకు కూడా వెళ్లేవాడ్ని. ప్రస్తుతం విజయనగరంలో స్నేహితులతో కలిసి ఒక గది తీసుకొని, డీఎస్సీకి చదువుతున్నాను. ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ ఇచ్చినా ఈ పరీక్ష జరుగుతుందో లేదోనని ముందే అనుమానం వచ్చింది. అనుకున్నట్టే జరిగింది.
- తామాడ ఆదినారాయన, డీఎసీˆ్స అభ్యర్ధి, దత్తిరాజేరు.


అప్పులు చేసి చదువుతున్నా

నేను 2014-16 విద్యా సంవత్సరంలో డీఎల్‌ఈడీ శిక్షణ పూర్తి చేశాను. ఆపై ఒక దఫా డీఎస్సీ తీశారు. ఇప్పటివరకు మళ్లీ ఆఊసే లేదు. తల్లిదండ్రులు, అమ్మమ్మ ఇచ్చిన డబ్బులతో కృష్ణ జిల్లా అవనిగడ్డలో శిక్షణ తీసుకున్నా. ప్రస్తుతం గత రెండేళ్ల నుంచి విజయనగరంలో ఉంటూ చదువుకుంటున్నా. గత ఐదేళ్లలో నా చదువులకే రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఇందులో అధిక మొత్తంలో అప్పు చేసినవే.  

- వావిలపల్లి కృష్ణ,  వెలగవలస గ్రామం, తెర్లాం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని