logo

జగన్‌ కక్ష..రోగులకు శిక్ష

ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే రోగులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది వైకాపా సర్కారు. గత ప్రభుత్వంపై కక్షతో అప్పట్లో ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల పథకాలను మూలకు చేర్చింది.

Published : 21 Apr 2024 05:25 IST

నాటి పథకాలను మూలకు చేర్చిన వైకాపా

 ప్రభుత్వఆసుపత్రుల్లో రోగుల విలవిల

 

ఘోష ఆసుపత్రి భవనంపై నిరుపయోగంగా సౌరవిద్యుత్తు ప్లాంటు

వివిధ రకాల వ్యాధులు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే రోగులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది వైకాపా సర్కారు. గత ప్రభుత్వంపై కక్షతో అప్పట్లో ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల పథకాలను మూలకు చేర్చింది. కనీసం నిర్వహణ లేకపోవడంతో ప్రస్తుతం అవన్నీ వినియోగానికి దూరమయ్యాయి. చివరకు గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడేవాటినీ పట్టించుకోలేదు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.
- న్యూస్‌టుడే, విజయనగరం వైద్యవిభాగం

ఆసుపత్రులపై విద్యుత్తు భారం పడకుండా ఉండేందుకు, సౌర విద్యుత్తును పెంచేందుకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు తన నియోజకవర్గం పరిధిలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు  శ్రీకారం చుట్టారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రోగులు, గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడేలా ప్రభుత్వ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అప్పటి కేంద్ర, ఘోష ఆసుపత్రుల్లో ప్లాంట్లు నెలకొల్పారు. దీంతో ఎంతో మందికి సౌకర్యంగా నిలిచేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ వ్యవస్థ అంతా తారుమారైంది.

కేంద్రాసుపత్రిలో ఇలా..

గత ప్రభుత్వ హయంలో రూ.కోట్ల మేర వెచ్చించి కేంద్రాసుపత్రి(ప్రస్తుతం సర్వజన)పై సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ వైద్యాలయానికి నెలకు రూ.3 లక్షలకుపైగానే బిల్లు వచ్చేది. సౌర వ్యవస్థతో ఆ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కొంత విద్యుత్తును ఏపీఈపీడీసీఎల్‌కు అమ్ముకోవచ్చని భావించారు. దాదాపు ఐదేళ్ల పాటు సేవలు అందాయి. వైకాపా వచ్చిన ప్రారంభంలో అరకొరగా పనిచేసిన ప్లాంటు అనంతరం మూలకు చేరింది. ఆసుపత్రికి విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు.

బండకేసి బాదాల్సిందే..

నిరుపయోగంగా లాండ్రీ

2014లో అశోక్‌ గజపతిరాజు కృషితో ఘోషాసుపత్రిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మోడరన్‌ మెక్‌నైజ్డ్‌ లాండ్రీ వ్యవస్థ ఏర్పాటైంది.  శస్త్రచికిత్సల్లో పాల్గొనే వైద్యులు, సంబంధిత రోగుల దుస్తులను కూడా ఇక్కడే ఉతికేవారు. దీనికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.17.50 లక్షలు వెచ్చించారు. 2019లో ఇది మరమ్మతులకు గురైంది. బాగుచేసేందుకు డబ్బుల్లేక మూలకు చేర్చారు. సోలార్‌ ప్లాంటు, మెక్‌నైజ్డ్‌ లాండ్రీని పరిశీలించి, అవసరం మేరకు చర్యలు తీసుకుంటామని ఆర్‌ఎంవో సురేష్‌ చెప్పారు.

 వేడి నీళ్లకు...

పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు ఘోషాసుపత్రిలో రూ.28.62 లక్షలతో సోలార్‌ వాటర్‌ హీటర్స్‌ను ఏర్పాటు చేశారు. వీటితో రోగులకు వేడినీటి సౌకర్యం కల్పించారు. ఫలితంగా రోజుకు 2800 మంది బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఉపయోగించుకునేవారు. అప్పుడే పుట్టిన పిల్లలకు వేడి నీటి స్నానం ఉపయోగకరంగా ఉండేది. విద్యుత్తు సైతం ఆదా అయ్యేది. వైకాపా వచ్చిన ప్రారంభంలోనే వీటన్నింటినీ ఆపేసింది. ప్రస్తుతం ఎక్కడా పనిచేయడం లేదు. ఘోష ఆసుపత్రిలో ప్రస్తుతం కొందరు రోగులు రూ.15 పెట్టి వేడి నీటి సీసా కొనుక్కుంటున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు