logo

దగాకోరు.. ‘మెగా’మాయ

రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వం తేల్చింది. కానీ తక్కువ పోస్టులకే నోటిఫికేషన్‌ ప్రకటించారు. ఎన్నికల కోసం పరీక్షల షెడ్యూల్‌, సిలబస్‌ను  మార్చేసింది.

Published : 21 Apr 2024 05:30 IST

డీఎస్సీ పేరుతో యువతకు గేలం

అయిదేళ్లూ నాన్చేసిన సీఎం

రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వం తేల్చింది. కానీ తక్కువ పోస్టులకే నోటిఫికేషన్‌ ప్రకటించారు. ఎన్నికల కోసం పరీక్షల షెడ్యూల్‌, సిలబస్‌ను  మార్చేసింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ వేస్తా. ఏటా డీఎస్సీ నిర్వహిస్తా.

- పాదయాత్రలో జగన్‌ హామీ


 న్యూస్‌టుడే, విజయనగరం విద్యా విభాగం:  వైకాపా ప్రభుత్వ విధానాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మాటల ముఖ్యమంత్రిగానే మిగిలిపోయారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. ఐదేళ్లలో ఒక్క పరీక్ష కూడా నిర్వహించకుండా ముంచేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అయితే తక్కువ పోస్టులు, వయోపరిమితి సడలింపు ఇవ్వకపోవడం, అప్రెంటీస్‌ విధానంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

విజయనగరంలో ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు(పాతచిత్రం)

 తెదేపాలో రెండు ప్రకటనలు

తెదేపా ప్రభుత్వ హయాంలో 2014, 2018లో రెండు డీఎస్సీలు నిర్వహించింది. ఈ రెండేళ్లలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 339, 377 చొప్పున పోస్టులకు ప్రకటనలు వెలువడ్డాయి. న్యాయస్థానం కేసుల కారణంగా 2018లో ప్రకటించిన పోస్టులనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేసింది. వైకాపా అయిదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా జరగలేదు. 2022 ఆగస్టులో టెట్‌(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) మాత్రమే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న డీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు 284 పోస్టులు ప్రకటించింది. టెట్‌కు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు, డీఎస్సీకి మార్చి 15 నుంచి పరీక్షలు జరుగుతాయని చెప్పింది. తక్కువ వ్యవధి కావడంతో మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య మార్పు చేశారు. ఈలోపు కోడ్‌ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది.

ఖాళీలకు గండి కొట్టి..

డీఎస్సీ కోసం అభ్యర్థులు సుమారు ఏడాదికాలంగా పలు రూపాల్లో ఆందోళనలు సాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల పోస్టుల్లో 6,100 పోస్టులకే మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ధర్నాలకు దిగారు. మెగా డీఎస్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోనూ పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని పలుమార్లు ముట్టడికి యత్నించారు. ఉమ్మడి జిల్లాలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వెయ్యి పోస్టుల వరకు ఖాళీలుండేవి. పాఠశాలల విలీనం, హేతుబద్ధీకరణ చర్యలతో వాటికి భారీగా గండి పడింది. డీఎస్సీ కోసం ఉంచిన ఖాళీల్లో ఉద్యోగోన్నతులు కల్పించారు. మిగులు పోస్టులను అవసరమైన సబ్జెక్టులకు మళ్లించి(కన్‌వర్షన్‌) ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం, కొన్ని పోస్టులు రద్దు చేయడం వంటి చర్యలతో ఖాళీల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తెదేపా హయాంలో 2014లో 23,592 మంది, 2018లో 32,711 మంది పోటీపడ్డారు. సుమారు అయిదేళ్లలో పెరిగిన అభ్యర్థులను బట్టి వీరి సంఖ్య సుమారు 50 వేల మంది ఉండొచ్చని భావిస్తున్నారు. పెరిగిన పోటీని బట్టి పోస్టులు చాలవన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మోటారు కార్మికుడిగా..

సాలూరు పట్టణానికి చెందిన ఈ యువకుడి పేరు ఎం.జోగారావు. ఎంఏ, బీఈడీ చదివాడు. ఉపాధ్యాయునిగా సేవలందించాలని ఎంతో ఆశ పడ్డాడు. ఏడాది పాటు డీఎస్సీ కోచింగ్‌ కూడా తీసుకున్నాడు. అయిదేళ్ల వైకాపా పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. దీంతో తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుని మోటారు కార్మికుడిగా మారాడు. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన టైర్లు, రిపేరు పనుల షాపు పెట్టుకున్నాడు. టైర్లకు గాలి నింపుతూ పంక్చర్లు వేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఎదురుచూపులే..

ఉపాధ్యాయుడిగా కావాలని చిన్న నాటి నుంచి నా ఆకాంక్ష. ఆరేళ్ల కిందట డీఈడీ పూర్తి చేశాను. అప్పటి నుంచి డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తూనే ఉన్నాను. గత అయిదేళ్లలో ఒక్కసారి కూడా పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను.
- సాయిశ్రీను, పాలకొండ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని