logo

తల్లిదండ్రులతో కలిసి.. భర్తను హతమార్చిన భార్య

గరివిడి మండలం వెదుళ్లవలస యాతవీధిలో నివాసం ఉంటున్న కొలుసు అప్పన్న అలియాస్‌ జుత్తులోడు హత్యకు గురయ్యాడు. అతని భార్య, ఆమె తల్లిదండ్రులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Published : 21 Apr 2024 05:33 IST

వెదుళ్లవలసలో దారుణం

కొలుసు అప్పన్న (పాత చిత్రం)

గరివిడి, న్యూస్‌టుడే: గరివిడి మండలం వెదుళ్లవలస యాతవీధిలో నివాసం ఉంటున్న కొలుసు అప్పన్న అలియాస్‌ జుత్తులోడు హత్యకు గురయ్యాడు. అతని భార్య, ఆమె తల్లిదండ్రులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. హత్య చేసిన తర్వాత నిందితులంతా మృతదేహానికి పసుపు రాసి సాధారణ మృతిగా చూపే ప్రయత్నం చేశారు. రాత్రి ఇంట్లో కేకలు వినిపించడం.. తెల్లవారే సరికి అప్పన్న మృతి చెందడంతో గ్రామస్థులు అనుమానించారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. చీపురుపల్లి సీఐ షణ్ముఖరావు, గరివిడి ఎస్సై దామోదరరావు శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పన్న తన సోదరి ఎల్లమ్మ కుమార్తె దేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళుతూ నెలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. మద్యం తాగే అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవ పడుతున్నారు. భార్య, ఆమె తల్లిదండ్రులతో అప్పన్నకు కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భర్తను ఎలాగైనా హతమార్చాలన్న దురుద్దేశంతో భార్య దేవి తన తల్లిదండ్రులు సన్యాసిరావు, ఎల్లమ్మల సహకారం తీసుకుంది. ముగ్గురూ కలిసి ఇంట్లోనే అప్పన్నను రాయితో తలమీద కొట్టి చున్నీతో మెడను బిగబట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  


క్రికెట్‌ బెట్టింగ్‌లతో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య

 గజపతినగరం(మెంటాడ), న్యూస్‌టుడే: క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దేవి వివరాల మేరకు.. పెదమేడపల్లి గ్రామానికి చెందిన కిల్లాడ ఈశ్వరరావు(25) తల్లి కిల్లాడ పైడిమ్మ, అక్కాబావ కిలపర్తి ఎర్రియ్యమ్మ, అప్పలనాయుడుతో కలిసి ఉంటున్నాడు. తల్లి పక్షవాతంతో మంచంపై ఉన్నారు. ఈశ్వరరావు బ్యాంకు నుంచి నగదు తెచ్చి కార్డుల ద్వారా అందించే ఎం.ఎస్‌.పీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విషం తీసుకున్నాడు. ఉదయం గుర్తించిన కుటుంబీకులు గజపతినగరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. గతంలో రూ.4 లక్షల వరకు బెట్టింగ్‌లో ఓడిపోయాడని, ఇటీవల మళ్లీ రూ.లక్ష వరకు బకాయి పడ్డాడని, అప్పులు చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, వ్యసనాలకు బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి అన్న రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


విద్యుదాఘాతంతో రైతు మృతి

రేగిడి, పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టించి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రైతును విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కాటేసింది. మండల పరిధిలోని బొడ్డవలసలో రైతు ఆలుబిల్లి అప్పలనాయుడు (58) శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఇతని సొంతూరు పాలకొండ మండలం అంపిలి. బొడ్డవలసలో ఉన్న చెరకు పంటకు నీరు పెట్టేందుకు ఉదయం 8 గంటల ప్రాంతంలో వచ్చి మోటారు వేసే సమయంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు శంకరరావు ఎరువుల బస్తా తీసుకుని పొలానికి చేరేసరికి మోటారు షెడ్డులోనే విగతజీవిగా తండ్రి పడి ఉండడం గమనించాడు. ఇతనికి భార్య నాగమణి, కుమారుడుతో పాటు వివాహమైన కూతుళ్లు పార్వతి, ప్రభావతి ఉన్నారు.  సమాచారం అందడంతో ఏఎస్సై రాజారావు సిబ్బందితో వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం ఆసుపత్రికి తరలించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని