logo

జగన్‌.. ఇదేనా నీ ఏలుబడిలో సంక్షేమం

మాటకు ముందు.. మాట తర్వాత నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారి సంక్షేమాన్నే గాలికొదిలేశారు. వసతిగృహాల్లో చదువుతున్న ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల అవస్థలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా స్పందన లేదు

Published : 21 Apr 2024 05:41 IST

అవస్థల నడుమే వసతిగృహాలు

విద్యార్థులకు తప్పని అవస్థలు

మాటకు ముందు.. మాట తర్వాత నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారి సంక్షేమాన్నే గాలికొదిలేశారు. వసతిగృహాల్లో చదువుతున్న ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల అవస్థలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా స్పందన లేదు. శిథిల భవనాలు, అధ్వాన గదులు, కానరాని మరుగుదొడ్లు, పెచ్చులూడిన స్లాబులు, కూలిపోయే పిల్లర్లు, విరిగిన కిటికీలు, తలుపులు.. ఇదీ ఉమ్మడి జిల్లాలోని వసతికేంద్రాల దుస్థితి. నాడు- నేడులో భాగంగా మరమ్మతులు చేసేందుకు కొన్నింటిని ఎంపిక చేసినా నిధులు రాలేదు.  మన్యంలో ప్రతిపాదనలు పంపినా.. ఒక్కటీ ఎంపిక కాలేదు. ఇదీ వెనుకబడిన వర్గాలపై అన్నకున్న ప్రేమ..

 న్యూస్‌టుడే, పార్వతీపురం, పార్వతీపురం పట్టణం: అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం వసతిగృహాలను గాలికొదిలేసింది. ఏళ్లుగా సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టనట్లు వ్యవహరించింది. ఫలితంగా విద్యార్థులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలు(ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలతో కలిపి) 204 ఉన్నాయి. వీటిల్లో 37 వేల మంది చదువుతున్నారు. ఎక్కడ చూసినా అవస్థలే దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. కొన్నిచోట్ల ఉన్నా.. తలుపులు ఊడిపోయాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రహరీలు లేక కర్రలు కట్టారు.
వీరంతా గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు. ఇక్కడ 390 మంది వసతి పొందుతున్నారు. భోజనశాల లేక రోజూ ఇలా చెట్ల కింద భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రహరీ లేకపోవడంతో ఓవైపు కర్రలు కట్టి వదిలేశారు.

అద్దె గదుల్లోనే..

విజయనగరంలో 48 బీసీ వసతిగృహాలున్నాయి. ఇందులో 22 అద్దె గదుల్లో నడుస్తున్నాయి. 17 ఎస్టీ కేంద్రాల్లో ఒక దానికి సొంత భవనం లేదు. 30 ఎస్సీ కేంద్రాల్లో 7 వరకు అద్దెలు చెల్లిస్తున్నాయి. మన్యం జిల్లాలో 13 ఎస్సీ వసతి గృహాలున్నాయి. బీసీ కేంద్రాలు 16 నడుస్తున్నాయి. వీటిల్లో తొమ్మిదింటికి అద్దె గదులే దిక్కు. ఎస్టీ వసతి కేంద్రాల్లో(ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు) 80 వరకు ఉండగా వీటిల్లో చాలావరకు వంట గదుల సమస్య ఉంది.

మరమ్మతుల ఊసేదీ

కేంద్రాలను బాగుచేస్తామని రెండేళ్ల కిందట ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నాడు-నేడు కింద విజయనగరం జిల్లాలో 45 కేంద్రాలను ఎంపిక చేశారు. ఇంతవరకు నిధులు రాలేదు. మన్యానికి సంబంధించి నాడు- నేడు కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కానీ అనుమతులు ఇవ్వలేదు. కొన్ని ఆశ్రమ పాఠశాలలను మాత్రమే ఎంపిక చేశారు. వాటిల్లోనూ పనులు పూర్తిచేయలేకపోయారు.
పార్వతీపురం జిల్లా కేంద్రం కొత్తబెలగాంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 214 మంది ఉంటున్నారు. నాడు- నేడు కింద రూ.62 లక్షలు మంజూరయ్యాయి. ఫ్లోరింగ్‌, విద్యుత్తు పనులు పూర్తయ్యాయి. మరుగుదొడ్లు, వంటగది నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. త్వరలోనే పూర్తిచేస్తామని హెచ్‌ఎం పీసీహెచ్‌.మోహనరాయుడు తెలిపారు.

భారీగా పేరుకున్న బకాయిలు

విజయనగరం జిల్లాలో గతేడాది నవంబరు, డిసెంబరు నెలల నుంచి బకాయిలున్నాయి. బీసీ కేంద్రాలకు సంబంధించి మెస్‌ ఛార్జీల కింద రూ.2.10 కోట్లు రావాలి. కాస్మోటిక్‌ ఛార్జీలు రూ.12 లక్షలు ఇవ్వాలి. ఎస్సీ కేంద్రాలకు వరుసగా రూ.1.50 కోట్లు- రూ.10 లక్షలు, ఎస్టీ గృహాలకు రూ.2 కోట్లు- రూ.5 లక్షల చొప్పున అందాలి. మన్యంలో అన్నింటికీ కలిపి రూ.7.2 కోట్ల మేర డైట్‌ బిల్లులు జమ కావాలి. బీసీ, ఎస్సీ కేంద్రాలకు రూ.9 లక్షల కాస్మొటిక్‌ ఛార్జీలు ఇవ్వాలి. నగదు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేస్తున్నామని సంక్షేమాధికారులు వాపోతున్నారు. మరోవైపు అద్దెల భారమూ తప్పడం లేదని చెబుతున్నారు.

విస్మరించిన వైకాపా..

సాలూరు మండలం మామిడిపల్లిలో ఐదేళ్ల క్రితం తెదేపా హయాంలో 2018 చివరలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల మంజూరు చేసి నిర్మాణం ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం పూర్తిగా వదిలేయడంతో ప్రస్తుతం ఓ రేకుల షెడ్డులో 175 మంది విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే మండలంలోని తోణాంలో వంటలు, భోజనాలు చేసే గదులు శిథిలం కావడంతో విద్యార్థులు వరండాల్లోనే తింటున్నారు.  
- న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం
కురుపాంలోని బీసీ వసతి గృహం శిథిలస్థితికి చేరింది. దీంతో పిల్లర్లు ఇలా ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ 38 మంది ఉంటున్నారు. అయిదేళ్లుగా మరమ్మతులు లేవు. స్లాబ్‌ ఇప్పటికే పెచ్చులూడుతోంది. మరుగుదొడ్లు, స్నానపు గదులు అధ్వానంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు